MEGHA Engineering | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఎంత దాచాలని ప్రయత్నించినా, కాస్త ఆలస్యమైనా దావానలంలా వ్యాపిస్తుంది. సుంకిశాల ఘటనపై అదే జరిగింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యధిలోనే జలమండలి ఉన్నతాధికారుల ఫోన్లు మోగాయి. కిందిస్థాయి ఇంజినీర్లు, ఏజెన్సీకి చెందిన ఇంజినీర్లు కూడా జరిగిన ఘటనను వివరించారు. కానీ ఆ వాస్తవాల్ని అక్కడే జలసమాధి చేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.
ఒకవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు జరుగుతున్న సమయంలోనే ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయానికి ఈ సమాచారం వచ్చింది. అయినా.. ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చేవరకు ఎందుకు గోప్యత పాటించారు? బయటికి వచ్చినరోజు జలమండలి ఉన్నతాధికారులు ఇచ్చిన అధికారిక వివరణలోనూ ఎప్పుడు తమ దృష్టికి వచ్చిందనే అంశాన్ని ఎందుకు పొందుపరచలేదు? దీన్ని గోప్యంగా ఉంచడం వల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరిని కాపాడే ప్రయత్నం? ప్రస్తుతం ఇంజినీరింగ్ వర్గాల మధ్య జరుగుతున్న చర్చ ఇదే. ఈ నేపథ్యంలో మేఘా ఇంజినీరింగ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం.. ఘటన తర్వాత చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు ఇప్పుడు నెమ్మదిగా బయటికొస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తున్నది.
నల్లగొండ జిల్లాలోని సుంకిశాల వద్ద జరుగుతున్న జలమండలి పనుల్లో ఒక్కసారిగా రిటెయినింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనపై రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తున్నది. దీనిపై ప్రభుత్వం గోప్యత పాటించటంపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో అసలు అప్పటి వరకు తమ దృష్టికే రాలేదని ప్రభుత్వమే చేతులెల్తేసిన విషయం తెలిసిందే. కారణాలు ఏవైనా.. సుంకిశాల వద్దే ఆ సమాచారం నిలిచిపోయింది తప్ప బయటికి రాలేదనే రీతిలో అటు మంత్రులు, ఇటు పురపాలకశాఖ ఉన్నతాధికారులు తమ ప్రకటనల్లో స్పష్టంచేశారు.
వాస్తవానికి ప్రమాదం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయానికి సమాచారం వచ్చినట్టు తాజాగా తెలిసింది. అంతేకాదు.. ఒకవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో జలమండలి ఉన్నతాధికారులకు ఫోన్లలో పూసగుచ్చినట్టుగా ఘటన వివరాలు అందాయని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పాటు 3 రోజుల వ్యవధిలోనే లిఖితపూర్వకంగా కూడా సమాచారం వచ్చింది. అయినా.. విషయం బయటికి పొక్కకుండా శాయశక్తులా ప్రయత్నించారు.
లేఖను తిరస్కరించిన పైఅధికారులు
సుంకిశాల ఘటన జరిగిన సమయంలో సైట్ వద్ద వాస్తవానికి జలమండలి ఇంజినీర్లు లేరు. జలమండలి ఈ నెల 8న ఇచ్చిన వివరణలోనూ ఇదే అంశాన్ని పేర్కొన్నది. కానీ ఘటన జరిగిన వెంటనే మేఘా ఇంజినీరింగ్ సంస్ఘ ఇంజినీర్లు జలమండలి ఇంజినీర్లకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు సుంకిశాల పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే (ఎగ్జిక్యూట్ చేసే) ఇంజినీర్ వెంటనే తన పైఅధికారులకు ఫోన్ చేసిన చెప్పారు.
అంతేకాదు.. లిఖితపూర్వకంగా లేఖను ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఆపైఅధికారుల ఆదేశాల మేరకు దాన్ని తిరస్కరించినట్టు ఇంజినీరింగ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దనే మౌఖిక ఆదేశాలు రావటంతో అందరూ మిన్నకుండిపోయారు. జలమండలి ఉన్నతాధికారులకు ఈ సమాచారం తెలిసినపుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం కొనసాగుతుండటం గమనార్హం. అయితే క్షేత్రస్థాయి ఇంజినీర్ మాత్రం పైఅధికారులకు చెప్పినా ఎందుకు గోప్యంగా ఉంచాలని అన్నదానిపై అనుమానం కలిగింది.
మున్ముందు ఇది తనకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడినట్టు తెలిసింది. చివరకు ముందుచూపుతో ఈ నెల 5న (ఘటన జరిగిన మూడు రోజులకు) లిఖితపూర్వకంగా తన పైఅధికారికి స్పీడ్ పోస్టు ద్వారా లేఖ పంపారు. స్పీడ్ పోస్టు కావటంతో అదేరోజు సదరు పైఅధికారికి అది చేరింది. శాఖాపరంగా ఒక ఇంజినీర్ తన పైఇంజినీర్కు మాత్రమే (త్రూ ప్రాపర్ చానెల్) లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాకాదని నేరుగా ఉన్నతాధికారులకు ఇవ్వడానికి వీలుండదు. దీంతో ఆ లేఖను డిప్యూటీ జీఎం స్థాయిలోనే నిలిపివేశారు.
ఆ లేఖలో ఉన్నది ఇదే..
అడిక్‌మెట్ ప్రాజెక్టు డివిజన్-3కి సంబంధించిన జనరల్ మేనేజర్‌కు ఈ నెల 5న వచ్చిన లిఖితపూర్వక నివేదికలో ఆ రోజు ఏం జరిగిందనే వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ‘ఈ నెల 2న ఉదయం 6.10 గంటలకు బ్లాక్-3, 4లోని ఎక్స్పాన్షన్ జాయింట్ వద్ద చిన్న సీపేజీ రావటం మొదలైంది. మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన నైట్‌డ్యూటీ సూపర్వైజర్ జగదీశ్ దీన్ని గమనించి, వెంటనే అప్రమత్తమయ్యారు.
సిబ్బంది, కార్మికులు, యంత్రాలను ఇన్‌టేక్ వెల్ నుంచి బయటికి తీసుకువచ్చారు. సీపేజీ ఒక్కసారిగా ఉధృతమై సొరంగంపై దక్షిణంవైపు రిటెయినింగ్ వాల్‌తో పాటు కౌంటర్ఫోర్ట్ వాల్‌ను తన్నుకొచ్చి పంపుహౌజ్ జలదిగ్భందమైంది. సాయంత్రం వరకు ఏ ఒక్కరూ గల్లంతు కాలేదనే సమాచారాన్ని మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన ప్రాజెక్టు మేనేజర్ నర్సిరెడ్డితో మాట్లాడి ధ్రువీకరించుకున్నాం. తదుపరి చర్యల కోసం సమాచార నిమిత్తం ఇది పంపుతున్నాం’ అని అందులో స్పష్టంగా ఉన్నది.
గోప్యతతో ఎవరికి ప్రయోజనం?
సుంకిశాల ఘటన తర్వాత జలమండలిలో ప్రకంపనలు రేగాయి. ప్రభుత్వం నలుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేయటంతో పాటు డైరెక్టర్‌ను బదిలీ చేసింది. దీనిపై జలమండలి ఇంజినీరింగ్ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. కిందిస్థాయి వారిని బలి చేస్తారా? అంటూ వాట్సాప్ గ్రూప్‌ల్లో నిరసన వ్య క్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల వరకు సమాచారం వెళ్లినా కిందిస్థాయి వారిని బాధ్యులు చేయటం ఎంతవరకు సమంజసమని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సస్పెండ్ అయిన ఇంజినీర్ల సంజాయిషీ సంతృప్తికరంగా లేదని ప్రభుత్వం పేర్కొన్నది.
మేఘా ఇంజినీరింగ్‌కు కూడా షోకాజ్ నోటీసు ఇవ్వగా, తామే బాధ్యులమని లిఖితపూర్వకంగా అంగీకరించిం ది. కానీ ఇప్పటివరకు ఏజెన్సీపై ప్రభు త్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటన వల్ల మేఘా ఇంజినీరింగ్‌పై ఒక మచ్చ పడింది. రూ.కోట్ల నష్టాన్ని కూడా భరించాల్సి ఉన్నది. కానీ ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకురాకపోతే సద రు ఏజెన్సీపై ఎలాంటి రిమార్కు ఉండేది కాదు. అకస్మాత్తు వరదతో పంపుహౌజ్‌లోకి నీళ్లు వచ్చాయంటూ దాని పునరుద్ధరణకు సర్కారు ఖజానా నుంచి రూ.కోట్ల బిల్లులు దండుకొనేవారు. ఇన్నిరోజులు ఉద్దేశపూర్వకంగా గోప్యత పాటించడం వెనక మేఘా ఇంజినీరింగ్‌ను కాపాడే ప్రయత్నం జరిగినట్టు రూఢీ అయ్యిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.