హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంపై చలి పంజా విసురుతున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పొగమంచు పెరిగింది. రానున్న రోజుల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే ప్రమాదం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
మంగళవారం ఉదయం 13 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు. పలు జిల్లాల్లో నిరుడితో పోలిస్తే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ శివారులోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 14 నుంచి 15 డిగ్రీల మధ్య రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తు తం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలాల్లో అత్యల్పంగా 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.