హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): పరిశ్రమల శాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నది. ప్రభుత్వం ఒకే పనికి ఇద్దరు అధికారులను నియమించి, ఎవరు ఏ పనిచేయాలో స్పష్టతనివ్వకపోవడం వివాదానికి కారణమైంది. వ్యవహారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి వద్దకు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. సహజంగా ఆయా ప్రభుత్వ శాఖల్లో అన్ని వ్యవహారాలకూ జవాబుదారీ ముఖ్యకార్యదర్శి. మంత్రి తరువాత ఆయనకే సర్వాధికారాలు ఉంటాయి. పరిశ్రమల శాఖలో ముఖ్యకార్యదర్శి ఆధీనంలో ప్రధానంగా పరిశ్రమలశాఖ కార్యకలాపాలు, పెట్టుబడుల ఆకర్షణ, రాయితీలు, భూముల కేటాయింపుకు సంబంధించిన టీజీఐఐసీ తదితర పనులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ పనులకు ఇద్దరు అధికారులను నియమించి ఇద్దరికీ బాధ్యతలు అప్పగించింది. వీరిలో ఒకరు సీఎం కార్యాలయం నుంచి పనిచేస్తుండగా, మరొకరు పరిశ్రమశాఖ కార్యాలయంలో ఉంటూ పనిచేస్తున్నారు. పెట్టుబడులు, కంపెనీలకు సంబంధించిన మెయిల్స్, ఇతర సమాచారమంతా పెట్టుబడుల సెల్‌కు వస్తుండగా, వాటిని ముఖ్యకార్యదర్శికి ఫార్వర్డ్ చేస్తున్నారు. కాగా, ముఖ్యకార్యదర్శి మాత్రం తనకే నేరుగా సమాచారం రావాలని కోరుతున్నారు. సీఎం కార్యాలయంలోని సెల్ నుంచి తనకు సమాచారం అందుతుండటం పట్ల ఆయన ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం.
అధికారాలపై కరువైన స్పష్టత
ఒకేరకమైన బాధ్యతలు నిర్వహించేందుకు ఇద్దరు అధికారులను నియమించినప్పుడు.. ఆ ఇద్దరికి బాధ్యతలను విభజించి ఎవరికివారు స్వతంత్రంగా పనిచేసే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రభుత్వం ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించాలో స్పష్టత ఇవ్వలేదు. పెట్టుబడుల ఆకర్షణ, బడా కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలు పూర్తిగా పెట్టుబడుల సెల్ ఆధీనంలో ఉంచి, మిగిలిన పరిశ్రమలు, టీజీఐఐసీ నిర్వహణ బాధ్యత పూర్తిగా ముఖ్యకార్యదర్శికి అప్పగిస్తే ఎటువంటి వివాదం ఉండదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారుల మధ్య కోల్డ్‌వార్‌తో పరిశ్రమలశాఖ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయనే వాదన వినిపిస్తున్నది. దీనిపై ప్రభుత్వం తగిన పరిష్కారమార్గం చూపాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు.