Madhira | మధిర, అక్టోబర్ 08 : మధిర మిర్చి మార్కెట్ యార్డ్‌లో కోల్డ్ స్టోరీస్ సిబ్బంది, ఏపీ వ్యాపారి అక్రమ దందాతో అక్రమ లావాదేవీలు కొనసాగుతున్నట్లు రైతులు ఆరోపణలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని రెండో పెద్ద మార్కెట్‌గా మధిర వ్యవసాయ మార్కెట్ నిలిచింది. ఈ మార్కెట్ పరిధిలోని మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధిరలోని కొన్ని కోల్డ్ స్టోరేజీలు, వాటిల్లో పనిచేసే సిబ్బంది కేవలం ఒకే ఆంధ్రా మిర్చి వ్యాపారస్తుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యాపారి ఇచ్చే కమీషన్లకు ఆశపడి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతులను మోసం చేసి నష్టపరుస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలకు ఏఎంసీ చైర్మన్ గానీ, మార్కెట్ శాఖ సెక్రెటరీ గానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
బహిరంగ వేలం లేకుండానే కట్టబెట్టడం కొన్ని సందర్భాలలో కోల్డ్ స్టోరేజ్‌ల సిబ్బంది ధరను బహిరంగంగా ప్రకటించకుండానే, నిల్వ ఉంచిన రైతుల మిర్చిని అప్పనంగా ఆ ఆంధ్ర వ్యాపారస్తుడికి కట్టబెడుతున్నట్లు సమాచారం. మిర్చి వ్యాపారం చేయడానికి లైసెన్స్ కంటే కమీషన్ ప్రధానం అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. లోకల్ వ్యాపారస్తులు ఎగుమతిదారులు (ఎక్స్పోర్ట్ సప్లైయర్స్) మధిర మార్కెట్లో లావాదేవీలు కొనసాగిస్తున్నప్పటికీ, కేవలం ఆ ఆంధ్ర వ్యాపారికి మాత్రమే కావాల్సిన సరుకు, కోరుకున్న ధరకు దొరుకుతుండడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని మిగతా వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
మార్కెట్ యార్డ్‌కు తలనొప్పిగా మారిన వ్యవహారం
రైతుల సరుకును ముందుగా మార్కెట్ యార్డ్‌కు తీసుకువచ్చి, మిగతా వ్యాపారులకు చూపించిన తర్వాత, వారికి సంబంధించిన వ్యాపారికి (ఆంధ్ర వ్యాపారికి) కట్టబెడుతూ కాటాలు వేయడం జరుగుతోందని తెలుస్తోంది. మార్కెట్ యార్డ్‌లో ఈ రేటు అడిగారు అంటూ ఇతర వ్యాపారులకు తప్పుడు సమాచారం ఇచ్చి, లోకల్ రైతులను వ్యాపారులను మోసం చేస్తున్నారని అనుమానాలకు దారి తీస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ అక్రమ లావాదేవీలపై నిలదీసిన కొంతమంది వ్యాపారులకు కోల్డ్ స్టోరేజ్ యాజమానులు కానీ, ఏఎంసీ చైర్మన్ కానీ, అధికారులు కానీ కనీసం జవాబు కూడా ఇవ్వడం లేదు. అడిగిన కాడికి కాటాలేస్తే ఎక్కువ కమీషన్ వస్తుందనే ఉద్దేశంతో కొందరు గుమస్తాలు కేవలం ఒక్క వ్యాపారిని మాత్రమే ప్రోత్సహిస్తున్నారని మిగతా వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తంతు కోల్డ్ స్టోరేజ్ యజమానులకు తెలిసే కొనసాగుతున్నట్లుగా సమాచారం. ఈ వ్యవహారం ఏఎంసీ చైర్మన్‌కు, మార్కెట్ శాఖ సెక్రెటరీకి పెద్ద తలనొప్పిగా మారింది. మార్కెట్లో ఈ అక్రమ దందా ఇలాగే కొనసాగితే, పూర్తి ఆధారాలతో ఖమ్మం జిల్లా కలెక్టర్ కిమార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు కొంతమంది వ్యాపారస్తులు రైతులతో కలిసి మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.
మిర్చి మార్కెట్లో దందాపై రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవు
మార్కెట్లో కోల్డ్ స్టోరేజీ గుమస్తాలు, ఆంధ్ర వ్యాపారి మిర్చి మార్కెట్లో దందా చేస్తున్నారనే విషయం తన దృష్టికి రాలేదని మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు స్పష్టం చేశారు. రైతులు ఎవరైనా స్వయంగా వచ్చి నిర్దిష్ట ఫిర్యాదు చేస్తే, వారిపై పై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మిర్చి వ్యాపారులందరూ తప్పనిసరిగా ట్రేడింగ్ లైసెన్స్ తీసుకోవాలని గత మార్కెట్ కమిటీ సమావేశంలో స్పష్టంగా సూచించడం జరిగింది. లైసెన్స్ లేకుండా రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేయడం మార్కెట్ నిబంధనలకు విరుద్ధం. వ్యాపారులు ఇప్పటికైనా లైసెన్స్ తీసుకొని కొనుగోలు చేయాలి. లేనిపక్షంలో, వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నరసింహారావు హెచ్చరించారు.