హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టాన్ని చలి వణికిస్తున్నది. కొన్ని జిల్లాల్లో 7 డిగ్రీలు, కొన్ని మండలాల్లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మారుమూల ప్రాంతాలు, అటవీజిల్లాల్లో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మొత్తంగా చలి రాష్ర్టాన్ని గజగజ వణికిస్తున్నది. ఈ చలిపులి పంజాతో చదువులు అటకెక్కుతున్నాయి. సీజనల్ జ్వరాలు, దగ్గు, జలుబులు మరోవైపు. అటూ చలి, ఇటూ సీజనల్ వ్యాధులతో మొత్తంగా చదువులకు ఆటంకం ఎదురవుతున్నది. చలితీవ్రతతో విద్యార్థులు బడులకు వెళ్లేందుకు జంకుతున్నారు. పొద్దున లేపి, బడికి తయారుచేయడం తల్లిదండ్రులకు సవాల్‌గా మారుతున్నది. కొందరైతే బడికి వెళ్లబోమంటూ మారం చేస్తున్నారు.
బడుల్లో విద్యార్థుల హాజరు అంతంతగానే ఉంటున్నది. కొన్ని స్కూళ్లల్లో అయితే 50% దాటడంలేదు. కొన్నింటిలో అయితే 10మంది కూడా రావడంలేదని టీచర్లు అంటున్నారు. బడికి వచ్చిన పిల్లలు ఏదో ఒక సమస్యతో వస్తున్నారు. అయితే దగ్గు లేదా జలుబు వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. అంటువ్యాధుల బారినపడుతున్నారు. హాస్టళ్లు, వసతిగృహాల్లోని విద్యార్థులు దుప్పట్లు సరిపోక, అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల కిటికీలు, తలుపులు సక్రమంగా లేకపోవడంతో చలి చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. కొన్ని గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నాయి.