గోదావరిఖని, ఏప్రిల్ 1: సింగరేణి సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 72 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. 70.35 మిలియన్ టన్నుల లక్ష్యానికి 50.58 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కరోనా సంక్షోభం చుట్టుముట్టినా నిలదొక్కుకున్నది. గతేడాది ఏప్రిల్లో లాక్డౌన్ ఉండటంతో అసలు ఈ ఆర్థిక సంవత్సరం సగమైనా బొగ్గు ఉత్పత్తి సాధిస్తుందా? లేదా అన్న అనుమానాలు తలెత్తాయి.
క్రమంగా కరోనా తీవ్రత తగ్గడంతో సంస్థ బొగ్గు ఉత్పత్తి పెంచుకుంటూ ముందుకు సాగింది. ఎట్టకేలకు 50 మిలియన్ టన్నులకుపైగా ఉత్పత్తి సాధించడంతో సంస్థ ఊపిరి పోసుకుంది. ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల్లో 97.50 లక్షల టన్నులకు 45,14,802 టన్నులు మాత్రమే సాధించింది. ఓసీపీల్లో 6,06,00,000 టన్నులకు 4,60,65,514 టన్నులు ఉత్పత్తి చేసింది. రామగుండం డివిజన్-3 మాత్రమే సాధించింది. ఇందులో 65 లక్షల టన్నులకు 68 లక్షల టన్నుల ఉత్పత్తితో 105 శాతం సాధించింది. మిగతా చోట్ల ఉత్పత్తి లక్ష్యం సాధ్యం కాలేదు.