సూర్యాపేట: సూర్యాపేట (Suryapet) మండలం రాయన్నగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున నెల్లూరు నుంచి హైదరాబాద్కు కొబ్బరిబోండాల (Coconut Truck) లోడుతో వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో రోడ్డుపై కొబ్బరిబోండాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొబ్బరి బోండాల కోసం ఎగబడ్డారు. బస్తాలు, సంచుల్లో అందినకాడికి ఎత్తుకెళ్లారు. అటుగా రోడ్డుపై కార్లలో వెళ్తున్న వారు కూడా కొబ్బరికాయలు తీసుకెళ్లారు. దీంతో సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని లారీ డ్రైవర్ వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీని తీసి రోడ్డు క్లియర్ చేశారు.