Minister KTR | తెలంగాణలోని బొగ్గు గనులను వేలం నుంచి తప్పించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలన్నారు. తమిళనాడులోని మూడు లిగ్నైట్ గనులను వేలం నుంచి తప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. సింగరేణి కాలరీస్ కోసం ఇదే డిమాండ్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. బొగ్గు గనుల కోసం రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు. దేశంలోని రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకని కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. ఏడో విడత బొగ్గు బ్లాకుల వేలం నిర్వహించనుండగా.. తమిళనాడులోని మూడు లిగ్నైట్ గనులను మినహాయిస్తున్నట్లు బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తి, తమిళనాడు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వేలం నుంచి గనులను తొలగించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే, దీనిపై రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ సైతం ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా టెండర్లు వేయడంపై పెను దుమారం చెలరేగింది. అదే సమయంలో తమిళనాడు బీజేపీ రాష్ట్రశాఖ సైతం లిగ్నైట్ గనుల వేలాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. దాంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
కేంద్రం నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖండించారు. సింగరేణిలోని మరోసారి బొగ్గు గనుల వేలానికి కేంద్రం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయినా, కేంద్రం స్పందించకపోవడంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా మహా ధర్నాకు పిలుపునిచ్చారు. మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులతో కలిసి పెద్దఎత్తున నిర్వహించారు. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం సైతం బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, గనులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేసింది.
ఇప్పటికే పలుమార్లు వేలం వేసినా ప్రైవేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, ఇవే గనులను నేరుగా సింగరేణి కేటాయించాలని కోరింది. అయినా, కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి, పెనగడప గనులను వేలం వేసేందుకు నిర్ణయించింది. ఓ వైపు తమిళనాడులో ప్రాంతీయ పార్టీల నిరసనలతో వెనక్కి తగ్గినట్లు పేర్కొన్న కేంద్రం.. తెలంగాణలో బీఆర్ఎస్తో పాటు సింగరేణి కార్మిక సంఘాల డిమాండ్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రానికో ఇదేం నీతి అంటూ మండిపడుతున్నారు.
This👇is exactly what we have been demanding & protested even today for Singareni Collieries
That 4 Coal mines of Telangana be removed from auction list & allocated Directly to SCCL
Why different rules for different states in the same country? #Singareni pic.twitter.com/0rOtdVKle8
— KTR (@KTRBRS) April 8, 2023