గోదావరిఖని, జూలై 7: సింగరేపై ప్రేమ, కార్మికులపై గౌరవం ఉంటే వేలంలో పాల్గొనకుండా కొత్త బొగ్గు బ్లాక్‌లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోలేటి, మాదారం, కేకే ఓసీ మందమర్రి, జేకే 5 విస్తరణ ఇల్లందు, మణుగూరు ఓపెన్‌కాస్ట్ గనుల అనుమతులను ఇప్పించి నిజాయితీ నిరూపించుకోవాలని హితవు పలికారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు. కేంద్రమంత్రి సమావేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను కాపాడేందుకేనని విమర్శించారు.
బొగ్గు కుంభకోణం, డీజిల్, పేలుడు పదార్థాల కొనుగోలు, ఓవర్ బర్డెన్ తొలగింపు టెండర్లలో అవినీతి, సోలార్ ప్లాంటు ఏర్పాటులో జరిగిన అక్రమాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బొగ్గు నిల్వలపైన సింగరేణి యాజమాన్యం విజిలెన్స్ విచారణ జరుపాలనడం విడ్డూరంగా ఉందన్నారు. దొంగకే తాళం చేతులు ఇవ్వడం.. సింగరేణి విచారణ జరుపడం రెండూ ఒక్కటేనని ఎద్దేవాచేశారు. కోల్ ఇండియాలో మాదిరిగా రూ.12,500, విలువైన బట్టలు సింగరేణిలో ఇప్పిస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 58వేల కోట్ల బకాయిలను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. టెండర్లలో సైట్ విజిట్ నిబంధనవల్ల సంస్థకు జరుగుతున్న నష్టంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక ఏమైందని ప్రశ్నించారు.