త్వరలో వెలువడనున్న ఉద్యోగ నోటిఫికేషన్లు
పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి
వీసీలతో సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 16 : త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతాయని, పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేలా యూనివర్సిటీల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వైస్ చాన్స్లర్లకు సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, ఉద్యోగావకాశాలకు కావాల్సిన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందుకయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో మంత్రి సమావేశమయ్యారు. మానవ వనరులను అభివృద్ధి చేయడంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని, ఇందుకు అధ్యాపకులు చొరవ తీసుకోవాలని సూచించారు. పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. భవిష్యత్తులో సమాజంపై ప్రభావం చూపే రంగాలను గుర్తించి కోర్సులను రూపొందించి ఆ రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని మంత్రి కోరారు. శాస్త్రీయ సంస్థలు, ప్రభుత్వ విభాగాలతో నెట్వర్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. నిర్దిష్టమైన రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా విశ్వ విద్యాలయాలు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. యూనివర్సిటీలలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు వీసీలతో కమిటీవేసి నివేదిక రూపొందిస్తామని సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. యాక్షన్‌ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలని వీసీలకు సూచించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ పాల్గొన్నారు.
‘ఈ – ఆఫీస్’గా ఉన్నత విద్యామండలి
కాగితరహిత సేవలందిచడంలో భాగంగా ఉన్నత విద్యామండలిలో ఈ-ఆఫీస్‌ను ప్రారంభించారు. వీసీల సమావేశంలో మంత్రి సబిత దీనిని ఆవిష్కరించారు. అన్ని యూనివర్సిటీలతో అనుసంధానించారు. ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ సహకారంతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు.