కొడంగల్, జులై 4: వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఇతర అధికారిక కార్యక్రమాల్లో ఎలాంటి హోదా లేకున్నా సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి పాల్గొనడంపై స్థానికులు, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం కొడంగల్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో కొడంగల్, బొంరాస్‌పేట, దుద్యాల మండలాల్లో రూ.10కోట్ల నిధులతో అధునాతన పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణాలకు పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్, ఎస్పీ నారాయణరెడ్డి, హౌసింగ్ ఐజీపీ రమేశ్‌తో కలిసి డైరెక్టర్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి ఎటువంటి హోదా లేనప్పటికీ రాష్ట్రస్థాయి అధికారులతో సమానస్థాయి గౌరవాన్ని కల్పించడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా లేక ప్రభుత్వ కార్యక్రమమా గుర్తించలేక పోతునట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.