మానకొండూర్, మార్చి 20 : బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హితువు పలికారు. బుధవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్లోని బీఅర్ఎస్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బీఅర్ఎస్ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు రామకృష్ణారావు, తోట ఆగయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల దుర్వినియోగంపై మాట్లాడితే ఎమ్మెల్యే కవ్వంపల్లి తన అనుచరులతో దాడులు చేయిస్తాడా? ఇదేనా ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు కుతాంత్రాలు చేసినా. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే దాకా ప్రజల గొంతుకనై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా పచ్చని పొలాలు, పంటలతో అన్నపూర్ణ నియోజకవర్గంగా పిలువబడిన మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి అసమర్థ పాలనతో నేడు సాగునీరులేక అల్లాడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. నియోజకవర్గం చుట్టూ మిడ్ మానేరు, ఎల్ఎండీ, తోటపల్లి, అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో పుష్కలంగా నీరున్నా సాగుకోసం అందివ్వని అసమర్థ నాయకుడు కవ్వంపల్లి అని విమర్శించారు. పెద్దలింగాపూర్ రైతులు సాగునీటి కోసం ధర్నా చేస్తుంటే కనీసం వారి సమస్యను పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. పదేండ్లలో మానకొండూర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగలేదని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే కవ్వంపల్లి అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. 15 నెలల్లో నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయన్నా తీసుకువచ్చావా? అని నిలదీశారు. అనంతరం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి కవ్వంపల్లికి జ్ఞానోదయం కలిగించాలని వినతిపత్రం ఇచ్చారు.