హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ):‘ఇంకెప్పుడు ఖాళీ చేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఖాళీ చేయరా?. ముఖ్యమంత్రి చెప్పాక కూడా పట్టనట్టు వ్యవహరించడమేంది? ఇవీ తెలుగు యూనివర్సిటీ అధికారులపై సీఎంవో నుంచి వస్తున్న ఒత్తిళ్లు. నాంపల్లి క్యాంపస్‌ను ఖాళీ చేయాలంటూ సీఎంవో అధికారులు బెదిరిస్తున్నారని యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. ఓ ప్రైవేట్ సంస్థ ఏర్పాటుచేసే మ్యూజియానికి యూనివర్సిటీ ప్రాంగణాన్ని ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీలు స్వయంప్రతిపత్తి గలవని, వాటిపై సర్కార్ పెత్తనమేంటి? అని నిలదీస్తున్నారు. యూనివర్సిటీ స్థలాలు, భవనాలను తిరిగి వెనక్కి తీసుకోవద్దని.. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అప్పగించవద్దని ప్రొఫెసర్ చెన్నప్పరెడ్డి కమిషన్ గతంలోనే చెప్పిందని, ఈ కమిషన్ సిఫార్సులను సర్కార్ తుంగలో తొక్కుతున్నదని.. వర్సిటీల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తున్నదని మండిపడుతున్నారు. నాంపల్లి ప్రాంగణ పరిరక్షణకు పోరాటాన్ని సాగిస్తామని తేల్చిచెప్తున్నారు. వారికి మేధావులు, విద్యావేత్తలు సైతం మద్దతుగా నిలుస్తున్నారు.
వర్సిటీ క్యాంపస్ కబ్జాకు కుట్ర!
నాంపల్లి తెలుగు వర్సిటీ ప్రాంగణంలో వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. వీటిని ఖాళీ చేయించాలన్న కుట్ర జరుగుతున్నదని అధ్యాపక వర్గాలు పేర్కొన్నాయి. ఈ రెండు ఖాళీ అయితే మొత్తం క్యాంపస్ కబ్జా అయినట్టేనని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మ్యూజియం ఏర్పాటు చేయాలనుకునేవారు ఈ రెండు ఆఫీస్‌లను ఖాళీ చేయాలని కోరడమేంది? అని ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక మొత్తం క్యాంపస్‌ను కబ్జా చేయాలన్న కుట్ర దాగి ఉన్నదని పేర్కొంటున్నారు. వర్సిటీ గ్రౌండ్‌ఫ్లోర్ మొత్తాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయిస్తే, ఈ ఆడిటోరియం ఆదాయం ప్రైవేట్ పరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని వర్సిటీ బోధనేతర సిబ్బంది మండిపడుతున్నారు.
కల్చరల్ శాఖ పెత్తనమేంది?
రాష్ట్రంలో మ్యూజియాలు కల్చరల్శాఖ ఆధీనంలో ఉంటాయి. ఇస్తే కల్చరల్శాఖ తన ఆధీనంలోని భవనాలు, స్థలాలు కేటాయించాలి. కానీ విద్యాశాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల యూనివర్సిటీ క్యాంపస్‌ను ప్రైవేట్ మ్యూజియానికి ఇవ్వాలని కోరడమేంది? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కల్చరల్శాఖ స్పెషల్ సీఎస్ వాణీప్రసాద్ జూన్ 17న విద్యాశాఖ కార్యదర్శికి ఓ లేఖ రాశారు. వర్సిటీ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఆద్యకళా మ్యూజియం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌ను సదరు సంస్థకు అప్పగించేందుకు ఉత్తర్వులివ్వాలని విద్యాశాఖను ఎలా ఆదేశిస్తారని విద్యార్థులు మండిపడుతున్నారు. వాస్తవానికి మొదట ఇదే మ్యూజియాన్ని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటుచేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఏర్పాటుచేసే ప్రయత్నం జరిగింది. అంతటా వ్యతిరేకతలు ఎదురయ్యాయి. ఓయూ విద్యార్థులు మ్యూజియం ఏర్పాటును తీవ్రంగా ఖండించారు. మొత్తంగా ఇప్పుడు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీపై కన్నుపడింది.. అంటూ విద్యార్థులు వాపోతున్నారు. శిల్పారామం, బంజారాభవన్, ట్రైబల్ మ్యూ జియం, లలితకళా తోరణం వంటివి పర్యాటక, సాంస్కృతికశాఖ ఆధీనంలో ఉన్నా యి. వాటిని కేటాయించాల్సి ఉండగా, నాంపల్లి క్యాంపస్నే కేటాయించాలనడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దలు పునరాలోచన చేయాలి
తెలుగు వర్సిటీ నాంపల్లి ప్రాంగణాన్ని ఆద్యకళ మ్యూజియానికి కేటాయించేందుకు మద్దతునిస్తున్నవారు.. మద్దతుపై పునరాలోచించాలని విద్యార్థులు కోరుతున్నారు. యూనివర్సిటీకి అండగా ఉండాల్సిన మేధావులు, విద్యావేత్తలు ప్రైవేట్ వ్యక్తుల పక్షాన ఉండటం గర్హనీయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జడ్జిలు, ప్రొఫెసర్లు, విజ్ఞులు ఆద్యకళా మ్యూజియం విషయంపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకే వర్సిటీకి రెండు భవనాలుంటే తప్పేంటని విద్యార్థులు, అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. ‘అబిడ్స్‌లో గోల్డెన్ త్రేషోల్డ్ భవనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరిటే ఉన్నది. బేగంపేటలో ఓయూకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ జెనెటిక్ డిసీజెస్ ప్రాంగణం ఉన్నది. ఓయూకు సైఫాబాద్ పీజీ కాలేజీ, సికింద్రాబాద్ పీజీ కాలేజీలు ఉన్నాయి. మరి తెలుగు యూనివర్సిటీకి నాంపల్లి, బాచుపల్లిలో రెండు క్యాంపస్లుంటే తప్పేంది?, ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ సంస్థలకివ్వడం ఏంది?’ అని ప్రశ్నిస్తున్నారు.
వర్సిటీ రెండుచోట్ల ఎందుకు? : తిరుమలరావు
తెలుగు వర్సిటీలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను ఆద్యకళా అవసరాల కోసం కేటాయించిందని ఆద్యకళా సేకర్త జయధీర్ తిరుమలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీంట్లో విద్యార్థులు వ్యతిరేకించేందుకు ఏమీ లేదని ఆయన ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఒకచోట మాత్రమే ఉండాలి. రెండుచోట్ల వీసీ, రిజిస్ట్రార్ చాంబర్లు ఎందుకు? అని ప్రశ్నించారు. ఆద్యకళా మ్యూజియం వ్యక్తులది కాదని, సంస్థ నడిపిస్తుందని తెలిపారు. సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక, హార్థిక సహకారం అందించడం మామూలే. ఎన్నో వ్యవప్రయాసాలకు ఓర్చి సేకరించిన వస్తు సంపదకు భారత ప్రభుత్వం సైతం గ్రాంట్ ఇస్తుంది. ఈ గ్రాంట్‌ను ప్రైవేట్ సంస్థలకు కూడా ఇవ్వడం రివాజు. ప్రభుత్వ జీవో కూడా ఉన్నది’ అంటూ తన వాదనను ప్రకటనలో వినిపించారు.
సానుకూల నిర్ణయం వచ్చేవరకు దీక్షలు
నాంపల్లి క్యాంపస్ పరిరక్షణ కోసం వర్సిటీ పరిరక్షణ సమితి ఆధ్యర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. ప్రత్యేక వార్తా ప్రసారాల ద్వారా తెలుగు వర్సిటీని ఆక్రమించే యోచనలో ఆచార్య జయధీర్ తిరుమలరావు ప్రయత్నాలు చేస్తున్నారంటూ జర్నలిజం విద్యార్థులు వ్యంగ్య ప్రదర్శనతో ఎండగట్టారు. ప్రభుత్వ నిర్ణయం సానుకూలంగా వచ్చేంత వరకు దీక్షలను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. తెలుగు వర్సిటీలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన పూర్వ వీసీ ఆచార్య ఎన్ గోపిని విద్యార్థులు మద్దతు కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా కృషిచేస్తానని తెలిపారు. ప్రభుత్వం ఇరుపక్షాల వాదనలు విని, సముచిత నిర్ణయం తీసుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయ ఆస్తులు, వారసత్వం, చరిత్రను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు ఏనుగు నర్సింహారెడ్డిని ఆందోళనకారులు చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. యూనివర్సిటీ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.