సింగరేణి సంక్షేమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (cmkcr) పెద్దపీట వేస్తున్నారని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు విశాలమైన డబుల్ బెడ్రూం క్వార్టర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా రెండో దశలో 643 కొత్త క్వార్టర్ల నిర్మాణానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీఎండీ ఎన్ శ్రీధర్ (N Sridhar)మాట్లాడుతూ.. 2018 ఫిబ్రవరి 27న శ్రీరాంపూర్‌లో జరిగిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై..సింగరేణి వ్యాప్తంగా పాత క్వార్టర్ల స్థానంలో కొత్తవి, సౌకర్యవంతమైన క్వార్టర్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మేరకు ఇప్పటికే భూపాలపల్లి, కొత్తగూడెం, ఆర్జీ-3 ఏరియా, సత్తుపల్లి ప్రాంతాల్లో 1853 క్వార్టర్లను నిర్మించామని, రెండో దశలో భాగంగా రూ.354 కోట్లతో మరో 643 క్వార్టర్లు నిర్మించబోతున్నామని వెల్లడించారు.
ఆధునిక డబుల్ బెడ్రూం క్వార్టర్లు..
18 నెలల కాలవ్యవధిలో నిర్మాణాలు పూర్తి చేస్తామని ఎన్ శ్రీధర్ పేర్కొన్నారు. సింగరేణిలో 43 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, 49,919 క్వార్టర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కొత్తగా గనులు విస్తరిస్తున్న ప్రాంతాల్లో, కాలం చెల్లిన క్వార్టర్ల స్థానంలో ఆధునిక డబుల్ బెడ్రూం క్వార్టర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. కార్పోరేట్ ఏరియాలో (కొత్తగూడెం) 209, కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ ప్రాంతంలో 353, సత్తుపల్లి ప్రాంతంలో 81 క్వార్టర్లను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
కార్మికులకు ఉచిత విద్యుత్, సొంతింటి నిర్మాణానికి రూ.10 లక్షల రుణంపై వడ్డీ చెల్లింపు, కార్మికుల తల్లిదండ్రులకు ఉచిత వైద్యం, కార్మికుల పిల్లల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్, ప్రతీ ఏటా లాభాల్లో వాటా వంటి అనేక పథకాలు సింగరేణి ఉద్యోగులకు అందిస్తున్నామని ఎన్ శ్రీధర్ వివరించారు. 2014లో ఒక్కో కార్మికుడి సంక్షేమానికి సగటున రూ. 90 వేల చొప్పున వెచ్చిస్తే, కేసీఆర్ ముందుచూపుతో ప్రస్తుతం 3.10 లక్షలకు పెరిగిందన్నారు. సింగరేణి చరిత్రలో అత్యధికంగా ఈ సంవత్సరం 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ దిశగా ఉద్యోగులందరూ కృషి చేయాలని, తద్వారా చరిత్రలోనే అత్యధిక లాభాలు, సంక్షేమం అందుకోవచ్చని సూచించారు.