హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): టీఎస్‌ఐపాస్‌లో దరఖాస్తు చేసుకొన్న చిన్నతరహా పరిశ్రమలకు కరెంట్ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న దక్షిణ డిస్కమ్ అధికారుల తీరు, కమీషన్ల కోసం కంపెనీలకు రెన్యువల్స్ ఇవ్వని వైనంపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ‘కరెంట్ ఇవ్వాలంటే కమీషన్!’ కథనం టీజీఎస్పీడీసీఎల్లో సంచలనం సృష్టించింది. మంగళవారం మింట్‌కాంపౌండ్‌లోని కార్పొరేట్ కార్యాలయంతోపాటు పలు జిల్లాల్లో ఈ కథనంపై చర్చ జరిగింది. ఇదే సమయంలో సీఎండీ జితేశ్ వీ పాటిల్ వివిధ విభాగాల అధికారులతో ఈ కథనంపై చర్చించారు.
ముఖ్యంగా టీఎస్‌ఐపాస్‌లో దరఖాస్తు చేసుకొన్న తర్వాత అన్నిశాఖల నుంచి అనుమతులు వచ్చినప్పటికీ ఎస్పీడీసీఎల్ మాత్రం నెలల తరబడి పెండింగ్‌లో ఎందుకు పెట్టిందనే అంశంపై సీఎండీ ఆరా తీశారు. కమర్షియల్ విభాగానికి చెందిన డైరెక్టర్ చక్రపాణితో పాటు సంబంధిత విభాగ అధికారులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఎన్ని కంపెనీలు పెండింగ్‌లో ఉన్నాయి, ఎందుకు కనెక్షన్ ఇవ్వలేదంటూ అధికారులను ప్రశ్నించారు. జనవరిలో ఈ పరిశ్రమలకు కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన డీటీఆర్లు తామే ఇవ్వడానికి నిర్ణయించి అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశామని కమర్షియల్ డైరెక్టర్ సీఎండీకి చెప్పినట్టు తెలిసింది.
‘నమస్తే తెలంగాణ’ కథనంలో పేర్కొన్నట్టుగా టీఎస్‌ఐపాస్‌లో దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు కరెంట్ కనెక్షన్ కోసం టర్న్‌కీ స్కీమ్ కింద 49హెచ్‌పీ 11కేవీ వోల్టేజీతో 63కేవీ డీటీఆర్ కావాలంటూ సర్వీస్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్లు కట్టారు. ఈ మేరకు డిస్కమ్ డీటీఆర్లు తయారుచేసే కంపెనీలకు రెన్యువల్ ఇవ్వాలి. వెండర్ లిస్ట్ తయారుకాలేదంటూ ఐదు నెలలుగా జాప్యం చేస్తున్న వైనాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెస్తే ఆ విషయాన్ని వదిలేసి, తాము వివిధ కారణాలతో కంపెనీలకు సర్వీసులు ఇవ్వలేకపోయామంటూ కమర్షియల్ విభాగం అధికారులు సీఎండీని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్టు సమాచారం.కేవలం 130 కంపెనీలకు మాత్రమే కనెక్షన్లలో జాప్యం జరిగిందని, అది కూడా వేర్వేరు కారణాల వల్ల అంటూ చర్చించినట్టు తెలిసింది. అయితే ‘నమస్తే’లో పేర్కొన్నట్టుగా 305 కంపెనీలు లేవని, వాటి విషయంలో తాము అన్నీ చర్చించామని ఒక ఉన్నతాధికారి చెప్పారు.
కానీ అసలు డీటీఆర్ సైప్లె చేసే కంపెనీలను రెన్యువల్ చేయకపోవడం వల్ల సర్వీస్‌చార్జీలు కట్టి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య సర్కిళ్లు, జిల్లాలవారీగా ఒక డీఈ దగ్గర ఉన్నప్పటికీ ఆయనను సీఎండీ వద్దకు రాకుండా చూశారని తెలిసింది. వాస్తవానికి టీఎస్‌ఐపాస్‌లో దరఖాస్తు చేసుకొన్నవారెందరు, వారికి డీటీఆర్ ఎందుకు పెండింగ్ పెడుతున్నారు.. వెండర్స్ లిస్ట్ ఎందుకు ఖరారు చేయడంలేదనే విషయాలు సీఎండీకి కమర్షియల్, పీఅండ్ఎంఎం విభాగాలు చూసే అధికారులు చెప్పాలి. కానీ వారిచ్చిన సమాచారం ‘నమస్తే’లో పేర్కొన్న సమాచారానికి పూర్తిగా భిన్నంగా ఉన్నట్టుగా తెలిసింది. కేవలం సాధారణ కారణాలతో ఎక్కడైతే సరఫరాలో అంతరాయాలు ఉన్నాయో, వేటికైతే సరైన పత్రాలు లేవో, చార్జీలు కట్టని కొన్నింటిని కలిపి ఒక లిస్ట్ తయారుచేసి సీఎండీకి ఇచ్చారు.
డీటీఆర్ సైప్లె చేసే ట్రాన్స్ఫార్మర్ల కంపెనీల జాబితాను రెన్యువల్ చేయలేదని తెలిసిన వెంటనే సీఎండీ ఆదేశాల మేరకు ఆయా కంపెనీలకు డిస్కమ్ అధికారులు ఫోన్ చేసి వారి వివరాలు పంపాలని కోరినట్టు తెలిసింది. త్వరలోనే టీఎస్‌ఐపాస్‌లో దరఖాస్తు చేసుకొన్నవారికి డీటీఆర్ ఇస్తామని డిస్కమ్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి చెప్పారు. మరోవైపు కంపెనీల నుంచి కాకుండా ఎస్పీడీసీఎల్ నుంచే డీటీఆర్లు ఇవ్వడానికి నిర్ణయించామని, త్వరలోనే ఈ నిర్ణయం అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా కమర్షియల్ విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇదిలా ఉంటే డిస్కమ్ స్టోర్స్‌లో డీటీఆర్తో పాటు మెటీరియల్ కొరత ఉన్నప్పటికీ కమర్షియల్ విభాగం ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకొంటున్నదని డిస్కమ్ ఉన్నతాధికారుల మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది.
డీటీఆర్ టెస్టింగ్కోసం డీఈ ఎంఆర్టీని పంపించాల్సి ఉండగా వారికి ఎలాంటి ఆదేశాలు లేవని, గతంలో టీఎస్ఐపాస్ దరఖాస్తుదారులకు డీటీఆర్ సరఫరా చేసిన ఆరు ట్రాన్స్ఫార్మర్ల కంపెనీల విషయంలో కూడా సదరు కమర్షియల్ విభాగం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడానికి ఈఆర్సీ రూల్స్ చూపిస్తూ డైరెక్టర్ కాలయాపన చేస్తున్నారంటూ ఆ విభాగం అధికారులే చెబుతున్నారు. కొందరు అధికారుల విపరీత చర్యలు, కమీషన్ల కక్కుర్తితో ఈ సమస్య తలెత్తుతున్నదన్న చర్చ జరుగుతున్నది.
ఇదే సమయంలో విద్యుత్ వ్యవహారాలు చూసే ఉపనేతను కూడా కలిస్తే ఆయన నుంచి ఇప్పటివరకు సానుకూల నిర్ణయం రాకపోవడం, కమీషన్లకు సంబంధించి ఒక స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణమంటూ మింట్‌కాంపౌండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘నమస్తే తెలంగాణ’లో కథనం వచ్చిన తర్వాత సదరు నేత కార్యాలయంలో కూడా ఈ వ్యవహారంపై చర్చ జరిగినట్టు తెలిసింది.