కోనరావుపేట, మే 14: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలలో రోడ్డుకు ఇరువైపులా పెంచిన చెట్లను విద్యుత్తు అధికారులు నరికేస్తున్నారు. ఆకు పచ్చని తెలంగాణే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు హరితహారం కింద రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు వృక్షాలుగా మారా యి. బాటసారులకు ఎంతో నీడనిస్తున్నాయి. అయితే నీడనిచ్చే చెట్లను నరికేస్తుండటంతో గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికురాలు బ్లెస్సీ ఆవేదన వ్యక్తం చేసింది. విద్యుత్తు తీగలకు అడ్డు వచ్చిన కొమ్మలను మాత్రమే తొలగించాలని, చెట్లను పూర్తిగా నరికివేయవద్దని మంగళవారం నిరసన తెలిపింది. ‘సీఎం సార్.. చెట్లను కాపాడాలని సిబ్బందికి చెప్పండి’ అంటూ కొట్టేసిన వృక్షాల వద్ద నిల్చుని ప్లకార్డు ప్రదర్శించింది.