హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బిడ్డల స్థానికతను ప్రశ్నార్థకం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థుల అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం ఇంకా మొద్దు నిద్ర ప్రదర్శిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చిన జీవో 33పై ప్రతిష్ఠంభన నెలకొన్నదని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరినా రాష్ట్రంలో ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నదని పేర్కొన్నారు. అక్టోబర్ 31లోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయకపోతే విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్న సోయి కూడా కాంగ్రెస్ సరారుకు లేకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థుల అడ్మిషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు క్షమించరాని నేరం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి అడ్మిషన్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే అడ్మిషన్ల ప్రక్రియను అస్తవ్యస్తం చేసిందని ధ్వజమెత్తారు. అనాచితంగా, అనవసరంగా తెచ్చిన జీవో 33పై విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ సరారు నిర్లక్ష్య వైఖరి వల్ల ఒక విద్యార్థికి నష్టం జరిగినా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
అమృత్ పథకం టెండర్ల అవినీతిపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందన ‘దొంగలు పడ్డ ఆరు నెలలకు..’ అన్నట్టు ఉన్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్‌వేదికగా బండికి స్ట్రాంగ్ కౌం టర్ ఇచ్చారు. బండి సంజయ్ హోం శాఖ మంత్రి అన్న విషయాన్నీ మరచారని ఎద్దేవా చేశారు. అమృత్ స్కీంలో అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మొత్తుకుంటే బండి సం జయ్ పాలు తాగుతున్న దొంగపిల్లిలా కన్వీనియంట్‌గా కండ్లు మూసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలా వెనుకేసుకొస్తున్న బీజేపీ తీరును, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.