Revanth Reddy | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నిర్వహించిన ఆన్లైన్ పోలింగ్‌పై సీఎం రేవంత్ సీరియస్ అయినట్టు తెలిసింది. సోషల్ మీడియాలో బలహీనంగా ఉన్నామని తెలిసినా కూడా ఏ ధైర్యంతో ఆన్లైన్ పోలింగ్ నిర్వహించారని ఆయన టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తాను ఏడాది కాలంగా పడిన కష్టాన్ని ఒక్క రోజులో గంగపాలు చేశారని, అసలు ఈ పోల్ ఇప్పుడు అవసరమా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. కనీస ఆలోచన లేకుండా చేసిన పనికి దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్టు గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రజల వద్దకు పాలన కావాలా..? ఫాంహౌజ్ పాలన కావాలా..? అంటూ కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్ ఐఎన్‌సీ తెలంగాణలో నిర్వహించిన 24 గంటల ఆన్లైన్ పోల్ సెల్ఫ్‌గోల్ అయిన విషయం తెలిసిందే. ఈ పోలింగ్‌లో పాల్గొన్న 67 శాతం మంది తమకు కేసీఆర్ పాలనే మళ్లీ కావాలని తెలిపారు.
పార్టీ నడిపే తీరు ఇదేనా: రేవంత్ ఫైర్
సీఎం రేవంత్‌రెడ్డి మన్నె సతీశ్‌కు ఫోన్ చేసి.. తమది 420 పాలన అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, అటువంటి ఆరోపణల ట్రాప్‌లో మీరు (సోషల్ మీడియా విభాగం) పడిపోయి ఏకంగా పోలింగ్ నిర్వహించటం ఏమిటని మండిపడ్డట్టు తెలిసింది. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కూడా ఫోన్ చేసి ఇదేనా మీరు పార్టీని నడిపే తీరు అని, పార్టీ అనుబంధ విభాగాల్లో ఏం జరుగుతున్నదో చూసుకోరా? అని నిలదీసినట్టు తెలిసింది .ఈ నేపథ్యంలోనే మీడియా ముందుకు వచ్చిన మన్నె సతీశ్ ఆన్లైన్ పోలింగ్ మీద వివరణ ఇచ్చారు. ప్రజల వద్దకు పాలన కావాలా..? ఫాంహౌజ్ పాలన కావాలా..? అని చాలా క్లుప్తంగా పోల్ పెట్టామని, ఇది పార్టీ గురించో.. ఏ నాయకుడి గురించో పెట్టలేదని.. వివరణ ఇచ్చారు.