Musi | హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ కోసం విదేశాల్లో అధ్యయనానికి ప్రభుత్వం సిద్ధమైంది. 19న దక్షిణ కొరియాలోని సియోల్ నగరాన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మూసీ పరీవాహక ప్రాంత ప్రజాప్రతినిధులను వెంటబెట్టుకొని ‘హెన్’ నదిని పరిశీలించేందుకు వెళ్లనున్నది.
ప్రజావ్యతిరేకతను పట్టించుకోకుండా ప్రభుత్వం ఈ టూర్ ప్రోగ్రాం పెట్టడం ఏమిటని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మూసీ సుందరీకరణ కోసం ప్రతిపక్షాలు కలిసిరావాలని సీఎం రేవంత్రెడ్డి ఫ్యామి లీ డిజిటల్ కార్డు ప్రారంభోత్సవ సభలో కోరారు.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ తాము ప్రజల పక్షాన పోరాడుతామని ఇప్పటికే బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు సహకరించటం లేదనే అపనింద మోపేందుకే సియోల్ టూర్కు తమను ఆహ్వానించిందని ఆ ప్రాంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వీరు టూర్కు వెళ్లకూడదని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని తమను ఆహ్వానించిన అధికారుల వద్ద స్పష్టం చేసినట్టు తెలిసింది.