Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ బీసీ కాదని, ఆయన లీగల్లీ కన్వర్టడ్ బీసీ అని సీఎం రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం కులగణన నివేదికపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మోదీది పుట్టుకతో ఉన్నత కులమని, 2001లో సీఎం అయిన తర్వాత తన కులాన్ని బీసీ జాబితాలో చేర్పించారని ఆరోపించారు. ఇక తమ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో ఎలాంటి తప్పిదాలు లేవని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై త్వరలోనే చట్టం చేస్తామని అన్నారు.
కులగణనపై సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన విమర్శలపై స్పందిస్తూ.. తమ పార్టీ నేతలు కూడా కులగణన లెక్కల్ని తప్పు పడుతున్నారని, ఇది మంచిదికాదని అన్నారు. అలా చేయడం వల్ల బీసీల పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని చెప్పారు. రాష్ర్టానికి రేవంత్‌రెడ్డే చివరి రెడ్డి సీఎం అంటూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. తాను చివరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదని, తమ నాయకుడు రాహుల్‌గాంధీ లక్ష్యం కో సం పనిచేస్తున్నట్టు తెలిపారు.
నమస్తే తెలంగాణపై అక్కసు
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’పై అక్కసు వెళ్లగక్కారు. పలుమార్లు నమస్తే తెలంగాణను పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నమస్తే తెలంగాణ వరుస కథనాలతో ప్రజలకు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిని అడ్డుకుంటున్నది. దీంతో ప్రభుత్వానికి నమస్తే తెలంగాణ దినపత్రిక కంటగింపుగా మారింది. ఇప్పటికే పలు సందర్భాల్లో అంతర్గత సమావేశాల్లో నమస్తే తెలంగాణపై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి బహిరంగ వేదికపై తన అక్కసు వెళ్లగక్కారు.
ప్రధాని మోదీ కులాలకు అతీతం
ప్రధాని మోదీపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నా రు. ప్రధానిని కులాలకు అతీతంగా అందరూ ప్రేమిస్తారని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలు బీసీ రిజర్వేషన్ నుం చి ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించా రు. మోదీని తిడితే ఏమవుతుందో రేవంత్‌కు త్వరలోనే తెలిసి వస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రేవంత్ తన పదవిని కాపాడుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.