మహబూబ్‌నగర్, జూలై 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజాపాలనపై కల్లు దుకాణాలు, బీరు, బారు షాపు వద్ద చర్చ పెట్టాలని యువకులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సావుకు పోయినా, దావత్‌కు పోయినా ఎక్కడిపోయినా కాంగ్రెస్ సర్కార్ పాలనపై చర్చించాలని వారిని కోరారు. జెడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభించి 20 ఏండ్లయిన సందర్భంగా సీఎం రేవంత్ సొంత మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో శనివారం ఏర్పాటుచేసిన కృతజ్ఞత సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, సీఎం మాట్లాడిన తీరుపై సభికులు, రాష్ట్ర ప్రజలు తలోవిధంగా మాట్లాడుకోవడం కనిపించింది. అయితే సొంత డబ్బా కొట్టుకొనేందుకు రూ.కోట్లు తగిలేసి సభ పెట్టినప్పటికీ పూర్తిస్థాయిలో జనం రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. ఇక ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే సభకు వచ్చిన కొద్దిమంది కూడా వెళ్లిపోయారు. సుమారు 20నిమిషాల పాటు సొంత డబ్బా కొట్టుకొని.. ఆ తర్వాత కేసీఆర్‌పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మళ్లీ అవే తిట్ల దండకం అందుకోవడంతో జనం.. ‘ఎప్పుడూ ఇవే మాటలు’ అంటూ విసుక్కుంటూ బయటకు వెళ్లిపోయారు. దీంతో సభా ప్రాంగణంలోని కుర్చీలన్నీ వెనుక వైపున ఖాళీగా కనిపించాయి. ఇక రేవంత్‌రెడ్డి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఉమ్మడి మిడ్జిల్ మండలానికి నయాపైసా కేటాయించకపోవడంతో మండల ప్రజలు పెదవి విరిచారు. మెస్సీతో ఫుట్‌బాల్ ఆడి ప్రపంచానికి మన గళం వినిపించామని సీఎం చెప్పుకొచ్చారు.
మిడ్జిల్‌కు మొండి‘చేయి’
రాజకీయ భిక్ష పెట్టిన మిడ్జిల్ మండలానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్‌రెడ్డి మొండి‘చేయి’ చూపించారు. సరిగ్గా 2006లో జూలై 4న మిడ్జిల్ మండలం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా జెడ్పీటీసీ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ ఇప్పుడు.. సీఎంగా ఎదిగారు. మండలానికి మహర్దశ పడుతుందని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. అరకొర నిధులు విడుదల చేసి ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేసి వెళ్లిపోయారు. స్థానిక శాసనసభ్యులు కూడా మండలానికి ఏం కావాలో సీఎంకు విన్నవించలేదు.
దత్తత పేరుతో మిడ్జిల్‌కు దగా..
సీఎం రేవంత్‌రెడ్డికి రాజకీయంగా ఎదగడానికి కారణమైన మిడ్జిల్ మండలాన్ని దత్తత తీసుకోవాలని ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. అయితే సీఎంగా ఉండి కూడా మండలానికి నిధులు కేటాయించకపోవడం.. అభివృద్ధిపై హామీలు ఇవ్వకపోవడం.. పైగా దత్తత పేరుతో మరో దగాకు తెరతీశారు. గతంలో ఆయన గురువు చంద్రబాబు తీసుకొని ప్రపంచ బ్యాంకు ముందు కరువు పరిస్థితులను పరిశీలించడానికి పాలమూరును చూపించినట్టే.. సీఎం అయి ఉండి కూడా పట్టించుకోకపోగా ఉప ముఖ్యమంత్రికి దత్తత తీసుకోమని చెప్పి చేతులు దులుపుకొన్నారు. మరో గమ్మతైన విషయం ఏమిటంటే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈ మండలం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. అప్పట్లో రేవంత్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు రబ్బానీకి కూడా మంచి పోస్ట్ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రిని, ఎంపీని కోరడం విచిత్రం.. అంతా తన చేతిలో పెట్టుకొని పక్కనున్న వారిపై నెట్టేయడం రేవంత్‌కు అలవాటేనని.. అదే రుజువు చేసిందని కాంగ్రెస్ నేతలే అంటున్నారు.
నిజంగా బికారీ అయ్యారా?
సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల శిల్పకళావేదికలో ‘మేము బికారులం.. తెలంగాణ వాళ్లను చూస్తే ఏం అడుగుతాడో.. అని దూరం పెడుతున్నారు’.. అనే మాటలను నిజం చేస్తూ.. మిడ్జిల్‌లో జరిగే బహిరంగ సభలో టెంట్లు వేసి వాటి మీద కవర్లు కప్పకుండా బికారీ అనే మాటను నిజం చేస్తున్నట్టు టెంట్లు కనిపించాయి.. ఒక వైపు వర్షం వస్తున్నా.. గాలి వీస్తున్నా అట్టహాసంగా చేపట్టిన బహిరంగ సభ ఇలా అరకొర ఏర్పాట్లు చేసి అధికారులు సీఎం మాటలను నిజం చేసి చూపించారని పలువురు పెదవి విరిచారు.
సభకు సగం మంది కూడా రాలే..
మిడ్జిల్‌లో కృతజ్ఞత సభకు భారీ ఏర్పాట్లు చేసినా జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు. అధికార యంత్రాంగం సుమారు 10వేల మందికి ఏర్పాట్లు చేయగా 5వేలకు మించి జనం రాలేదు. వెనుక వైపు సగం ఖాళీగా కుర్చీలు కనిపించాయి. సీఎం ప్రసంగించే వేదిక ముందు ఒక టెంట్ అటు ఇటు రెండు టెంట్లను వేశారు. ఒక్కో టెంటులో 1,500 మంది కెపాసిటీతో కుర్చీలను ఏర్పాటు చేశారు. సీఎం వేదిక ముందున్న టెంట్లో చివరి వరకు ర్యాంపు నిర్మించడంతో ఇందులో 800వరకు మాత్రమే కుర్చీలు వేశారు. కుడి, ఎడమ వైపున కుర్చీలు వేసినా అవన్నీ ముందుభాగం తప్పించి వెనుక మొత్తం ఖాళీగా కనిపించాయి. దీంతో కృతజ్ఞత సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది.
సమ్మేళనంలో ఆత్మీయులను విస్మరించారని..
సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కాంగ్రెస్ పార్టీలో గందరగోళం రేపింది. తన రాజకీయ భవిష్యత్‌కు సహకరించిన ఆనాటి మిత్రులు, ఆత్మీయులతో కలిసి ఊర్కొండపేట అభయాంజనేయుడి సన్నిధిలో ఆత్మీయ సమ్మేళనంలో ఏర్పాటుచేసుకున్నారు. అయితే అసలైన మిత్రులు, ఆత్మీయులను పక్కన బెట్టారనే ఆరోపణలు విపిపించాయి. 2006లో రేవంత్ వెన్నంటి ఉన్న తమను దూరం పెట్టారని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు.
మీడియాకు అనుమతులు లేవు
మీడియాకు అనుమతి లేదని డీపీఆర్వో ప్రెస్‌నోట్ విడుదల చేశారు. సీఎంవో ఆదేశాలను అనుసరించి మీడియాకు పాస్‌లు ఇవ్వ డం లేదని అధికారులు తెలిపారు. కాకపోతే.. ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న ఊర్కొండ, మిడ్జిల్ మండలాల విలేకరులకు వీఐపీల పేరిట పాస్‌లు పంపిణీ చేయడంపై జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కొత్తగా ఇదేం పద్ధతి అంటూ మండిపడుతున్నారు. ఊర్కొండ గేట్ వద్ద మండల పరిషత్ ఉన్నత పాఠశాలకు సెలవు ప్రకటించారు. వాహనాల రాకపోకలను నిలిపివేసి పాస్‌లు ఉన్న వారినే అనుమతించారు. వాతావరణం సహకరించకపోవడంతో సీఎం పర్యటన మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. పర్యటన ఆలస్యం కావడంతో చుట్టుపక్కల గ్రామాల వారు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇబ్బంది పడ్డారు. సీఎం రోడ్డు మార్గాన రావడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఆత్మీయ సమ్మేళనంలో అంతా అనిరుధ్‌రెడ్డి మార్క్
సీఎం రేవంత్‌తో ఆత్మీయ సమ్మేళనానికి మిడ్జిల్, ఉర్కొండ మండలాల్లోని బీఆర్ఎస్ సర్పంచులను ఆహ్వానించినా వారికి పాసులు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. మరో వైపు సీఎం రేవంత్‌తో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి సీఎంవో నుంచి పాసులు ఇచ్చినా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అనుచరులు వారి పాసులు లాక్కొని ఎమ్మెల్యే అనుచరులకు ఇవ్వడం కలకలం రేగింది. అంతేకాకుండా అప్పట్లో రేవంత్‌తో సన్నిహితంగా మెలిగిన వారిని రానివ్వకుండా అనిరుధ్ అనుచరులకి ప్రాధాన్యత ఇవ్వడం.. అక్కడి నుంచి వచ్చిన లిస్టును కాదని ఎమ్మెల్యే లిస్టును ఓకే చేయడం గమనార్హం.
ఎర్రవల్లి నిర్వాసితులు, వివిధ పార్టీల నేతల అరెస్ట్
నార్లాపూర్-డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చారకొండ మండలంలోని గోకారం వద్ద తలపెట్టిన రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి న్యాయం చేయాలని నిర్వాసితులు దీక్షలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్, ఊర్కొండకు సీఎం పర్యటనలో భాగంగా ముందస్తుగా తెల్లవారుజామున ఎర్రవల్లి, ఎర్రవల్లితండాకు వెల్దండ పోలీసులు చేరుకొని నిర్వాసితులను గృహనిర్బంధం చేసి ఆంక్షలు విధించారు. కొంతమందిని అరెస్టు చేసి కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్వాసితులు పోలీసుల, ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో కల్వకుర్తి, ఊర్కొండ, చారకొండ మండలాల బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల నాయకులను అదుపులోకి తీసుకొన్నారు. సదరు నేతల ఇండ్ల వద్దకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు.
యువకులకు నాదో సూచన. మా ప్రజాపాలనపై బీర్ షాపులు.. బార్ షాపులు.. కల్లు దుకాణాల దగ్గర చర్చ పెట్టండి. పెళ్లికి పోయినా, సావుకు పోయినా, దావత్‌కు పోయినా, ఎక్కడికిపోయినా ఆలోచన చేయాలె.
– మిడ్జిల్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి