CM Revanth Reddy | హైదరాబాద్, జూలై13 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం అభ్యర్థి మోతీలాల్ ఇటీవల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన దీక్షను భగ్నం చేస్తూ పోలీసులు అరెస్టు చేసినా గాంధీ దవాఖానలో దీక్ష కొనసాగించారు. అయితే తాజాగా జేఎన్టీయూలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి నిరుద్యోగుల దీక్షను అపహాస్యం చేస్తూ మాట్లాడారు.
మోతీలాల్ దీక్షపై విమర్శలు గుప్పించారు. దీక్ష చేస్తున్నవారెవరూ పరీక్షలు రాయడం లేదని చులకనగా మాట్లాడారు. నిరుద్యోగ దీక్షలను రాజకీయ దీక్షలుగా అభివర్ణించారు. వాస్తవానికి మోతీలాల్ జూన్ 2024లో గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యాడు. అతను గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అవేవీ తెలియకుండానే సీఎం రేవంత్రెడ్డి హేళ్లన చేస్తూ మాట్లాడడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. వివిధ పరీక్షలకు మోతీలాల్ చేసుకున్న దరఖాస్తులను ఆధారాలతో చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో నిప్పులుచెరిగారు.