కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో సభ. అక్కడున్నది నిన్నగాక మొన్న ఎన్నికైన సర్పంచ్‌లు. వారికి సందేశం ఇవ్వడానికి వచ్చినవారు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీమాన్ అనుముల రేవంత్‌రెడ్డి గారు. లాంఛనాలన్నీ పూర్తయ్యాక ఆయ న మైకు అందుకుని ప్రసంగించడం ప్రారంభించారు. అందులో తిట్లదండకం ఉన్నది. బూతు పురాణం ఉన్నది. అనుచిత వ్యాఖ్యలు ఉన్నయ్. నీయవ్వలాంటి మాటలున్నయ్. అనేకానేక నీచ, నికృష్ట పదాలతో సంస్కారహీనంగా ప్రసంగం ఉన్నది!
తెలంగాణ జాతిపిత, ఉద్యమనేత, అభివృద్ధి ప్ర దాత కేసీఆర్ గురించి, ఆయన కుటుంబం గురించి.. గౌరవ ప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు పరమ జుగుప్సాకరంగా ఉన్నా యి. సీఎం సొంత జిల్లాలో పాలమూరు పనులు ఎందుకు చేపట్టడం లేదని కేసీఆర్ నిలదీసినందుకు రేవంత్ నోటినుంచి వెలువడిన రోతభాష అది. ప్రశ్నించడం తట్టుకోలేక, జవాబు చెప్పలేక బజారుభాషనే ముఖ్యమంత్రి ఆశ్రయించారు.
స్థాయి మరిచి, సోయి మరిచి రేవంత్ ప్రసంగిస్తున్నంత సేపు కండ్లల్లో నిస్పృహ తాండవించింది. మాటల్లో నిరాశ ధ్వనించింది. లోలోంచి తన్నుకొస్తున్న రేవంత్ ఆక్రోశం చూసి వెనుక ఉన్నవాళ్లు నివ్వెరపోయిండ్రు. ముందున్నోళ్లు హతాశులైండ్రు. అధికారం తెచ్చిన అహంకారంతో రేవంత్ అదుపు తప్పిండు. మాట మీద, మనసుమీద నియంత్రణ కోల్పోయి ఫ్రస్ట్రేషన్‌తో ఆగమాగమైండు.
సరిగ్గా నాలుగురోజుల్లో రాష్ట్రం రెండు దృశ్యాలను చూసింది. అటు కేసీఆర్ లేవనెత్తిన అంశాలను, ఇటు రేవంత్ మాట్లాడిన మాటలను విన్నది. ఎవరిది విషయమో, ఎవరిది విషమో తేలిపోయింది. చిన్నపిల్లోడికి కూడా ఇప్పుడు ఒక్కటే అర్థమైంది..
కేసీఆర్‌ది ఇరిగేషన్.. రేవంత్‌ది ఇరిటేషన్!
కేసీఆర్‌ది సాగుభాష.. రేవంత్‌ది సావుభాష!
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ఒకే ఒక్క ప్రెస్‌మీట్‌తో సీఎం రేవంత్‌రెడ్డికి జడుపు జ్వరం పట్టుకున్నది. మూడు రోజుల తర్వాతకూడా ఆయన కోలుకోలేదు. ఈ మూడు రోజులు ఆయనకు నిద్ర కరువైంది. ఆఖరుకు కలలో కూడా కేసీఆరే దర్శనమిచ్చారో ఏమో అదుపుతప్పారు. నోరు జారారు. ఫ్రస్ట్రేషన్‌కు గురై ఇష్టమున్నట్టుగా తిట్ల దండకం అందుకున్నారు. రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘకాలం ఉద్యమించి, పదేండ్లు రాష్ట్రానికి దశాదిశను నిర్దేశించి దేశంలోనే తెలంగాణను అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలిపిన కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు సమాజం నివ్వెరపోతున్నది. ఒక సీఎం, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇంత జుగుప్సాకరంగా మాట్లాడినవారు దేశచరిత్రలో ఇప్పటి వరకు లేరు, భవిష్యత్తులో ఉండకూడదని విజ్ఞులు ఆశిస్తున్నారు. బాధ్యతాయుతస్థానంలో ఉన్న నాయకుడు తాను మాట్లాడుతున్నది నాలుగు గోడల మధ్యనా, బహిరంగ ప్రదేశంలోనా? తాను మాట్లాడుతున్నది రాజకీయ వేదికా? ప్రభుత్వ వేదికా? మైక్‌లో మాట్లాడుతున్నారా? మైకంలో మాట్లాడుతున్నారా? మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు? అనేది చూసుకోవాలి కదా! పౌరుడో.. సమాజమో… ప్రతిపక్షమో… ప్రతిపక్ష నాయకుడో మరొకరో ఏదైనా అడిగితే, ఆ అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంటే చెప్పాలె. జవాబు చెప్పకపోతే, చెప్పుడు ఇష్టంలేకపోతే మౌనం దాల్చాలి.
అంతేకానీ, మాటల ఫిరంగునై పేలుతా.. నోటితుప్పర్లతో మందుపాతరనై పేలుతా… విచ్చలవిడితనంతో విధ్వంసమై పేలుతా, అడిగితే కడిగిపారేస్తా? అన్నట్టు వ్యవహరించటం ఏమీ దుస్థితి? అని ప్రజలు హతాశులవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. జాతిపిత మహాత్మాగాంధీ చూపిన గాంధేయమార్గంలో, అంబేద్కర్ విరచిత రాజ్యాంగ విలువల ఆచరణతో సాధించుకున్న రాష్ర్టానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నామనే భావనతోకాకుండా ఒక అతిసాధారణ వీధిపౌరుడిగా బజారుభాషను ప్రయోగించటం తెలంగాణ చేసుకున్నపాపమనే ఆవేదన వ్యక్తం అవుతున్నది. బుధవారం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అందులో భాగమే ఆయన బజారు భాషను ఆశ్రయించారనే చెప్తున్నారు. మరోవైపు తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని, ఆ జాతిని అధికారంలోకి రానీయ.. గెల్వనీయనే గెల్వనీయ అని సీఎం వ్యాఖ్యలు చేయటంపై ప్రజాస్వామికవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య ప్రమాణాలకువిరుద్ధమని పేర్కొంటున్నారు.
పేరెత్తకుంటే చావుకోరుతావా?
వయస్సులో, అనుభవంలో తన కన్నా పెద్ద అనే కనీస స్పృహలేకుండా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ బహిరంగసభలో బూతుజాలం (పదజాలం) ప్రయోగించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం కేసీఆర్ రాష్ట్రంలో సర్వభ్రష్ట ప్రభుత్వం ఉన్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను ‘కృష్ణ’లో కలుపుతున్నారని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం కూడబలుక్కొని కృష్ణానది జలాలను ఎత్తుకుపోతుంటే, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలకు డీపీఆర్ రూపొందించి పంపిస్తే, అదే ప్రాజెక్టును 45 టీఎంసీలు చాలు అని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మోకరిల్లింది? ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది? అని సూటిగా అడిగారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని ‘తోలుతీస్తా’మని హెచ్చరించారు. దానికి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నోరుపారేసుకోవటం అదీ, విచక్షణను కోల్పోయి మాట్లాడటం తెలంగాణ రాజకీయాలకే కాదు ప్రజాజీవితాలకు సరైంది కాదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్ దాదాపు నాలుగున్నర గంటలపాటు (మీడియా సమావేశం సహా) మాట్లాడారు. ఈ మొత్తంలో ఆయన ఎక్కడా సీఎం రేవంత్‌రెడ్డి పేరెత్తలేదు. అంతమాత్రానికి రేవంత్‌రెడ్డి కేసీఆర్ చావును కోరటం దారుణ చర్య అని అంటున్నారు. తాను రాజకీయాలు మాట్లాడను, ఎవరినీ తిట్టడం లేదు అని ఒకవైపు అంటూనే మరోవైపు ‘నీ గజ్వేల్కొస్తా.. నీ నెత్తిమీద కాలుబెట్టి తొక్కుతా’ అని, ‘వచ్చి తొక్కుడు తొక్కితే పాతాళానికి పోయినవ్’ అని, ‘నడుముకు రాయి కట్టుకొని మల్లన్నసాగర్లో దూకితే సచ్చిపోతవు. రంగనాయక్‌సాగర్‌లో దూకేముందు మెడకు తాడేసుకొని ఉరేసుకో.. సచ్చిపోతవ్…’ అంటూ వ్యాఖ్యానించటం రేవంత్‌రెడ్డి దిగజారుడు భాషకు నిదర్శమని ఉదహరిస్తున్నారు. తన అక్కసు, అహాన్ని రేవంత్‌రెడ్డి ప్రదర్శించటంపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ‘నీ యవ్వ…నీ అమ్మ’ అని సీఎం స్థాయిలోని వ్యక్తి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడటం దుర్మార్గమని పేర్కొంటున్నారు.
రేవంత్ ఫ్రస్ట్రేషన్ వెనుక
కొంతకాలంగా కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దుష్ప్రచారాలు చేస్తున్నారు. ‘ఇగ కేసీఆర్ పని అయిపోయింది. ఇక ఆయన ఫాంహౌస్‌కే పరిమితం అవుతారు. క్రియాశీల రాజకీయాల నుంచి కేసీఆర్ శాశ్వతంగా దూరం అవుతారు. వయస్సురీత్యా, ఆరోగ్య సమస్యలరీత్యా ఆయన ఇక ప్రజాక్షేత్రంలోకి రాడు’ అనేది రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, సమస్త కాంగ్రెస్ శ్రేణులు తలపోశాయి. అయితే, వాటన్నింటినీ కేసీఆర్ పటాపంచలు చేశారు. ఇంతకాలం తాము చేసిన ప్రచారం అంతా ఉత్తదేని ప్రజలకు తెలిసిపోయింది. కాంగ్రెస్ ఆశలను అడియాశలు చేస్తూ వారి ఊహలను ఉరితాళ్లకు వేలాడదీసి కేసీఆర్ మళ్లీ బయటకు వచ్చారు. సంపూర్ణ ఆరోగ్యంతో కేసీఆర్ ఉన్నారని ఆదివారం తెలంగాణ భవన్సాక్షిగా నాలుగు కోట్ల మందికి అర్థమైపోయింది. సంపూర్ణ ఆరోగ్యంగా కేసీఆర్ బయటికి రావటమే కాకుండా నాలుగున్నర గంటలపాటు ఉల్లాసంగా, నిరాఘాటంగా నవ్వుతూ, నవ్వించారు.
‘తెలంగాణకు నేనున్నా’ అనే రీతిలో వ్యవహరించారు. ఇది రేవంత్‌రెడ్డికి రుచించలేదు. ఆయన వెన్నులో వణుకు మొదలైంది. తట్టుకోలేకపోతున్నారు. రేవంత్‌రెడ్డి తీవ్ర ఫ్రస్ట్రేషన్‌లోకి జారుకున్నారని, అది ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నదని అందుకు కొడంగల్ వేదికగా చేసిన వ్యాఖ్యలే నిదర్శమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రేవంత్ వీరావేశానికి పోడియంపై ఉన్న మైకులే కకావికలం అయ్యాయని ఉదహరిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డికి పాలమూరే పాశంలాగా చుట్టుకునేలా కనిపిస్తుందని గ్రహించారు. అందులోంచి బయటపడాల్నంటే ఒకే ఒక తారకమంత్రం అది తిట్లు. డైవర్షన్ టాక్టిక్స్ తిట్లదండకం. బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేకనే, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయస్థితిలోనే రేవంత్‌రెడ్డి మరోసారి డైవర్షన్ పాలిటిక్స్‌ను ఆశ్రయించారని చెప్తున్నారు.
ముఖ్యమంత్రి పదవికి కళంకం రేవంత్‌రెడ్డి ; పల్లె నుంచి పట్నం వరకు జనం ఛీత్కారం సీఎంను ఓ రేంజ్లో ఆడుకుంటున్న నెటిజన్లు
సీఎం రేవంత్‌రెడ్డిలో రోజురోజుకూ అసహనం… క్రోధం ఎక్కువైతున్నది. పాలన చేతగాక.. రాష్ర్టాన్ని పాతాళానికి తొక్కిన రేవంత్‌రెడ్డి… దిక్కుతోచక నోరు పారేసుకుంటున్నడు. సహనంతోపాటు, మతిస్థితిమితం కూడా కోల్పోయి.. తాను సీఎం అనే విషయం మర్చిపోయి.. బజారు భాష కంటే హీనమైన మాటలు మాట్లాడుతున్నరు. ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం సిగ్గుచేటు. తెలంగాణకు ఒకప్పుడు రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తి సీఎంగా పని చేశాడని భవిష్యత్తు తరాలు అసహ్యించుకుంటాయి అంటూ ప్రజలు, ప్రజాసంఘాల నేతలు, రాజకీయ విశ్లేషకులు, సోషల్‌మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడైన కేసీఆర్‌ను ఉద్దేశించి, అభివృద్ధిని పరుగులు పెట్టించిన దార్శనికుడి గురించి, పదేండ్ల పాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థాయిలో నిలబెట్టిన జనహృదయనేత గురించి…. కొడంగల్‌లోని కోస్గి సభలో నీచమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి పదవికే కళంకం అని మండిపడుతున్నారు. బుధవారం సోషల్‌మీడియాలోని చాలా వేదికలపై రేవంత్‌రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటున్న పోస్టులే వెల్లువెత్తాయి. మొత్తానికి సీఎం రేవంత్‌రెడ్డికి సొంతంగా హోదా అనేది లేకపోయినా.. సీఎం హోదా పరువు తీస్తున్నారని అంటున్నారు.