ఖైరతాబాద్, ఏప్రిల్ 13: జనాభాలో తమ సామాజికవర్గాన్ని తగ్గించి, అవమానించిన వారికి భవిష్యత్తులో మున్నూరుకాపుల తడా ఖా ఏమిటో చూపిస్తామని పలువురు వక్తలు హెచ్చరించారు. ‘మేము యాచిస్తలేం.. హక్కులనే అడుగుతున్నం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9 మంది ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు మూడున్నర శాతం చూపి మున్నూరుకాపులను చట్టసభలకు దూరం చేస్తున్నారు.. బీసీలలో అత్యధికంగా అన్యాయానికి గురైనది మున్నూరు కాపులే.. మళ్లీ కులగణన చేపట్టాలి.. అప్పుడే ప్రభు త్వం కుట్ర బయటపడుతుంది’ అని వారు అభిప్రాయాలను వ్యక్తంచేశారు. మున్నూరుకాపులు ఐక్యతతో ఉండి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ మున్నూరుకాపు సంఘం, మున్నూరుకాపు గర్జన కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో మున్నూరుకాపుల ‘దశ దిశ’ ఆత్మీయ సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, బాజిరెడ్డి గోవర్ధన్, తెలంగాణ మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం మున్నూరుకాపు సామాజికవర్గాన్ని తక్కువ చేసి అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. ఇలాగే జరిగితే భవిషత్తు తరాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయడమే కాదు తమ సామాజికవర్గాన్ని అవమానించిందని మండిపడ్డారు. బీసీలను తక్కువ చేసి అందులో మున్నూరుకాపుల సంఖ్యను మరింత తగ్గించారని తెలిపారు. కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవులకు కూడా నోచని స్థితికి తీసుకొచ్చారని తెలిపారు. నేడు మంత్రివర్గంలో బీసీలకు స్థానం లేదని, 3.94 కోట్ల జనాభాలో మున్నూరుకాపులు 13 లక్షలే ఉన్నారంటే సిగ్గుచేటని పేర్కొన్నారు.
మున్నూరుకాపులంటే ఎందుకు భయం?
మున్నూరుకాపులంటే ఎందుకు భయపడుతున్నారని గంగుల కమలాకర్ ప్రశ్నించారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నందునే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో బీసీలను నియంత్రించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో మాజీ ఎంపీ వీ హన్మంతరావు కూడా సీఎం కావాల్సి ఉండగా, ఆయనను తొక్కిపెట్టారని ఆరోపించారు. మున్నూరుకాపులు తలచుకుంటే ప్రభుత్వమే ఉండదదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. ఈ సమావేశానికి రాకుండా ప్రభుత్వంలోని కొందరిని అగ్రవర్ణ పెద్దలు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలుపై చిత్తశుద్ధి ఉంటే సీఎం, మంత్రులు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చందర్, నరేందర్, సురేంద్ర, ఎమ్మెల్సీ కొమురయ్య, మాజీ ఎమ్మెల్సీ లలిత, టీడబ్ల్యూఆర్డీసీ మాజీ చైర్మన్ ప్రకాశ్, జగిత్యాల జడ్పీ మాజీ చైర్మన్ వసంత్, మున్నూరుకాపు మహాసభ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్రావు, లక్ష్మణ్, తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పటేల్, మున్నూరుకాపు గర్జన నిర్వహణ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ చందు జనార్దన్, మున్నూరుకాపు సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మహేందర్‌కుమార్, మున్నూరుకాపు డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు రవిపటేల్, అపెక్స్ కమిటీ కన్వీనర్ పురుషోత్తంపటేల్, మహిళా అధ్యక్షురాలు పద్మ, యూత్ ఫోర్స్ అధ్యక్షుడు అఖిల్, సాయి, అరుణ్, విఠల్, సంజీవ్, ప్రవీణ్, అనిల్, రామారావు పాల్గొన్నారు.