బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి4 (నమస్తే తెలంగాణ) : మరోసారి మోదీ ప్రధాని కావాలని బీజేపీ నేతల కన్నా ఎక్కువగా సీఎం రేవంత్‌రెడ్డి కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై ఆయన ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే లాభం లేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పకనే చెబుతున్నారని పేర్కొన్నారు.
‘రాబోయే రోజుల్లో మీ సహకారం అవసరం’ అని అధికారిక కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోదీని కోరడంలో ఆంతర్యం అదేనని విశ్లేషించారు. లోక్‌సభ ఎన్నికల్లో సొంత పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలనే ఆశ, వస్తుందనే భరోసా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా? బీజేపీ కోసం పనిచేస్తున్నారో ఆ పార్టీ నేతలే తేల్చుకోవాలని సూచించారు.