Pharma City | హైదరాబాద్, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): ఫార్మాసిటీపై రాష్ట్రప్రభుత్వం డొంకతిరుగుడు వైఖరిని అవలంబిస్తున్నది. ఉంటుందం టూ ఒకసారి, చేపట్టలేమని మరోసారి ప్రకటి స్తూ గందరగోళం సృష్టిస్తున్నది. ప్రాజెక్టును చేపట్టలేక.. వద్దని చెప్తే సేకరించిన రైతుల భూములు వెనక్కి ఇవ్వలేక రోజుకో మాట చెప్తున్నది, ప్రభుత్వాధినేత కూడా రెండునాల్కల ధోరణిని అవలంబిస్తున్నారు. ఆయనే ఒకటీరెండు సార్లు ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు స్వయంగా ప్రకటించారు. ఒకసారి ఫార్మా సిటీ!.. మరోసారి ఫార్మా విలేజ్!.. ఇంకోసారి జిల్లాల్లో ఫార్మా క్లస్టర్స్! ఇట్లా సీఎం వైఖరి కూడా మారుతూ వచ్చింది. మీడియా ముందు, కాంగ్రెస్ సభల్లో చెప్తున్నదానికి పొంతన ఉండటం లేదు. సీఎం వ్యాఖ్యల తర్వాత జిల్లాల్లోనూ ఫార్మా క్లస్టర్లకు ప్రక్రియ మొదలైంది. పలుచోట్ల భూసేకరణ కూడా కొనసాగుతున్నది. దాన్ని వ్యతిరేకిస్తూ పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. అంటే ఫార్మాసిటీ రద్దుపై ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్న మాట నిజం! జిల్లాల్లో ఆ ప్రక్రియ కొనసాగుతుండటం నిజం! కానీ హైకోర్టుకు మాత్రం ప్రభుత్వం వేరేవిధంగా చెప్తున్నది. తన దాగుడుమూతలతో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నది.
నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టు కోసం రైతు ల నుంచి భూమిని సేకరిస్తే.. ఆ భూమిని దాని కోసమే వినియోగించాలి. మరో పనికోసమో, మరో ప్రాజెక్టుకోసమో ఆ భూములను వాడటానికి వీల్లేదు. ఒకవేళ ఫార్మాసిటీ రద్దు చేస్తే.. దానికోసం రైతుల నుంచి సేకరించిన 13 వేల ఎకరాలను తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అందుకే రేవంత్ ప్రభుత్వం రద్దును అధికారికంగా ప్రకటించలేకపోతున్నది. మరోవైపు అక్కడ స్పోర్ట్స్ విలేజ్ కడుతామని సన్నాయినొక్కులు నొక్కుతున్నది. భూముల్ని మరో ప్రాజెక్టుకు బదలాయించడం చట్టవిర్ధుమని న్యాయనిపుణులు చెప్తున్నా రు. ఫార్మాసిటీయే లేనప్పుడు మా భూముల్ని వెనక్కి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అనేకచోట్ల ఫార్మాసిటీకి భూసేకరణ మొదలైంది. అంటే ఫార్మాసిటీ రద్దుపై ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నది. క్షేత్రస్థాయిలో ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇది నిజం! కానీ, హైకోర్టుకు మాత్రం ప్రభుత్వం వేరే విధంగా చెప్తున్నది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నది. ఫార్మాసిటీని రద్దు చేసి వివిధ ప్రాంతాల్లో 10 ఫార్మా విలేజ్లను ఏర్పాటుచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భా ల్లో ప్రకటించిన విషయం విదితమే. అయితే, ప్రభుత్వం కోర్టుకు శనివారం సమర్పించిన అఫిడవిట్లో మాత్రం.. ఫార్మాసిటీని రద్దుచేసినట్టు ఎక్కడా ఉత్తర్వులు ఇవ్వలేదని, మీడియాలో వచ్చిన కథనాలు ప్రామాణికం కాదని పేర్కొన్నది. దీంతో ప్రభుత్వం రెండు నాల్కల వైఖరి అవలంబిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 27న జరిగిన బయోఏషియా వార్షిక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నలువైపులా ఫార్మా విలేజ్లను ఏర్పాటుచేస్తామని, 1000 నుంచి రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో, రూ.లక్ష కోట్ల పెట్టుబడితో 10 ఇంటిగ్రేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ ఫార్మా విలేజ్లను ఏర్పాటుచేస్తామని, ముందుగా వికారాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో వీటి ని తీసుకొస్తామని చెప్పారు. కాగా, ఆయా జిల్లాల్లో భూములు అందుబాటులో లేవని కలెక్టర్లు స్పష్టంచేశారు. తాజాగా, ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోనే సుమారు 1000 నుంచి 2000 ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు టీజీఐఐసీ అధికారులు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. వాస్తవానికి గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల పరిధిలో ఫార్మాసిటీ కోసం 13వేల ఎకరాల భూమిని సేకరించారు.
అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు దేశ, విదేశాలకు చెందిన అనేక కంపెనీలు ముందుకొచ్చాయి. ఫార్మాసిటీకి అవసరమైన పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. కాగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు అక్కడ ఫ్యూచర్‌సిటీ పేరుతో కొత్త నగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కానీ, నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భూమిని సేకరిస్తే.. ఆ భూమిని దానికోసమే వినియోగించాలి. మరో అవసరానికి ఆ భూములను వినియోగించే వీలులేదు. అందు కే తమ నుంచి సేకరించి భూములను వెనక్కి ఇచ్చివేయాలని రైతులు కోరుతున్నారు. కానీ, ఫార్మాసిటీ కోసం భూములు సేకరించిన ప్రాం తంలో స్పోర్ట్స్ విలేజ్ కడతామని ప్రభుత్వం చెప్తున్నది. అట్లా మళ్లించడం చట్ట విరుద్ధమని న్యాయనిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యం లో ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన కొందరు రైతులు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వానికి ఏమిచేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫార్మాసిటీ యథా ప్రకారం కొనసాగుతుందని, రద్దుచేస్తున్నట్టు ఎటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం.. కోర్టుకు శనివారం నివేదించింది.
ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాలు సేకరించగా, తాజాగా ప్రభుత్వం పేర్కొంటున్న గ్రీన్ ఫార్మాసిటీని రెండువేల ఎకరా ల్లో ఏర్పాటు చేసేందుకు టీజీఐఐసీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. ప్రభు త్వం కోర్టుకు నివేదించిన ప్రకారం ఫార్మాసిటీని ఏర్పాటుచేస్తే సేకరించిన భూముల్లో ఫార్మాసిటీ రావాల్సి ఉన్నది. ఒకవేళ ఫార్మాసిటీని రెండు వేల ఎకరాలకే పరిమితం చేస్తే మిగిలిన 11 వేల ఎకరాలను దేనికోసం వినియోగిస్తారనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు. ముచ్చర్ల కేంద్రంగా ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం కోర్టుకు నివేదించిన విధంగా ఫార్మాసిటీని కొనసాగిస్తే ఫ్యూచర్‌సిటీని ఎక్కడ ఏర్పాటుచేస్తారో చెప్పాలని పలువురు కోరుతున్నారు. ఫార్మాసిటీని 13 వేల ఎకరాల్లో ఏర్పాటుచేస్తే సీఎం చెప్తున్న ఫార్మా విలేజ్ల కథ కంచికి చేరినట్టేనా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఫార్మాసిటీతోపాటు పది ఫార్మావిలేజ్లను కూడా ఏర్పాటుచేస్తారా? ఇవన్నీ ప్రస్తుతం సామాన్య ప్రజలను, భూములిచ్చిన రైతులనే కాకు ండా పరిశ్రమ వర్గాలను కూడా వేధిస్తున్న ప్రశ్నలు. ప్రభుత్వ అయోమయ ధోరణి వల్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు ఏమిచేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రం దేశ ఔషధ రంగానికి రాజధానిగా కొనసాగుతున్నది. దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఫార్మా ఉత్పత్తుల్లో మూడింట ఒక వంతు మన రాష్ట్రం నుంచే వెళ్తున్నాయి. వ్యాక్సిన్ క్యాపిటల్‌గా కూడా మన రాష్ర్టానికి పేరున్నది. కొవిడ్ వ్యాక్సిన్లలో సింహభాగం మన రాష్ట్రం నుంచే ప్రపంచానికి ఎగుమతి అయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన స్నేహపూర్వక విధానాల వల్ల ఈ రంగం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందింది. ఔషధ రంగంలో రాష్ర్టానికి ఉన్న సుస్థిర స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం భారీస్థాయిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీనికి అవసరమైన పర్యావరణ అనుమతులను కూడా సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే తలంపుతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీపై కక్షపూరిత ధోరణి అవలంభిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.