హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత ఇమేజ్ కోసం రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకానికే గండికొడుతున్నారు. అదనపు జలాలను సాధించాల్సింది పోయి, సాధించుకున్న నికర జలాలకే ఎసరు పెడుతున్నారు. రాజకీయ స్వార్థానికి ఇటు భీమా ఆయకట్టు రైతులకు, అటు సొంత నియోజకవర్గం రైతులకు తీరని విద్రోహాన్ని తలపెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రతిపాదించిన కొడంగల్ -నారాయణపేట లిఫ్ట్ పనులను చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. రూ.2,945 కోట్లతో ఇటీవలే అందుకు పరిపాలన అనుమతులివ్వగా, బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ఆ పనులకు శంకుస్థాపన చేసేందుకు సిద్ధమయ్యారు.
రాజీవ్‌భీమా జలాలకు గండి
కృష్ణా డెల్టాకు ట్రిబ్యునల్ -1 దాదాపు 183 టీఎంసీలను చారిత్రక రక్షణల కింద కేటాయించింది. డెల్టా కాల్వల ఆధునికీకరణ వల్ల 29 టీఎంసీల మేరకు మిగులు ఏర్పడుతున్నదని చెప్పి అందులో 9 టీఎంసీలను పులిచింతల ప్రాజెక్టుకు కేటాయించింది. మిగిలిన 20 టీఎంసీలను తెలంగాణ ఉద్యమానికి జడిసి రాజీవ్ భీమా ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రలో నాటి పాలకులు కేటాయించారు. ప్రాజెక్టు కింద ఒక టీఎంసీకి 10 వేల ఎకరాలకు నీరందించేలా మొత్తంగా 2.03 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని నిర్ణయించారు. జలయజ్ఞంలో భాగంగా రాజీవ్ భీమా ప్రాజెక్టును ప్రారంభించినా, రాష్ట్ర ఏర్పాటు నాటికి పనులేమీ పూర్తికాలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరమే పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం భీమా ప్రాజెక్టు కింద ఇప్పటికే 1.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. మిగిలిన ఆయకట్టుకు నీరందించేందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టును సత్వర సాగునీటి ప్రయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద గత ప్రభుత్వం చేర్చింది. మరో రూ.45 కోట్లను కేటాయిస్తే ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన పూర్తి ఆయకట్టుకు సాగునీరందుతుంది. ఇటీవలే కేంద్రానికి ప్రతిపాదనలను కూడా పంపింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు భీమా ప్రాజెక్టు డ్యూటీని (1 టీఎంసీకి సాగయ్యే భూమి) 10,000 ఎకరాల నుంచి 15,000 ఎకరాలకు పెంచింది. తద్వారా 20 టీఎంసీల నికరజలాల్లో 7.33 టీఎంసీల నీటిని సేవింగ్స్ కింద చూపించి కోత విధించింది. 12.67 టీఎంసీల నీటితోనే భీమా కింది ఆయకట్టు అవసరాలను తీర్చవచ్చని నిర్ధారించింది. భీమా ఆయకట్టు రైతులకు చెందాల్సిన 7.33 టీఎంసీల జలాల్లో 7.11 టీఎంసీలను నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కేటాయించింది.
ఉమ్మడి సర్కారు కుట్రలకే మొగ్గు!
బేసిన్ అవతలి తమ ప్రాజెక్టులకు కృష్ణా జలాలను యథేచ్ఛగా కేటాయించుకున్న ఉమ్మడి రాష్ట్ర పాలకులు, బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులపై ఆది నుంచీ వివక్ష చూపారు. భీమా ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయకుండానే, కుట్రపూరితంగా ప్రాజెక్టు నికర జలాలను కుదించి, మిగిలిన జలాల్లో 7.11 టీఎంసీలను కొడంగల్ -నారాయణపేట లిఫ్ట్‌కు ఉమ్మడి సర్కారే కేటాయించింది. నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని 10 మండలాల్లో 40,470 హెక్టార్లకు (సుమారు లక్ష ఎకరాలకు) సాగునీరందించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టేజ్ -1 అనుమతిని మంజూరుచేస్తూ జీవో 69ని మే 23, 2014లో జారీచేసింది. ఆ జీవోపై తెలంగాణ వాదులు, సాగునీటి రంగ నిపుణులు అనాడే తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేశారు. జీవో 69కి కొనసాగింపుగా కాంగ్రెస్ సర్కారు మరో జీవో విడుదల చేసింది. కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ స్కీమ్ స్టేజ్-1 పనులకు ఏకంగా రూ.2,945.50 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. కృష్ణా జలాల్లో అధికమొత్తంలో నీటిని డిమాండ్ చేయాల్సిన తరుణంలో ఏకంగా నికరజలాల్లోనే కోతలు విధించటమే ఏమిటని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ స్కీమ్‌ను నాలుగు దశల్లో చేపట్టి నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.
పాలమూరు ఉండగా ఎందుకీదండగ?
దుర్బిక్ష ప్రాంతాలైన నారాయణపేట-కొడంగల్ ప్రాంత రైతాంగానికి సాగునీటి వసతి కల్పించాలని మాజీ సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఉమ్మడి పాలకులు కుట్రపూరితంగా ప్రతిపాదించిన లిఫ్ట్‌ను పక్కన పట్టారు. అదే సమయంలో కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ కింద ప్రతిపాదిత ఆయకట్టుకు రెండింతల ఆయకట్టుకు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా సాగునీరందించడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే పాలమూరు ప్రాజెక్టు ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయి. రిజర్వాయర్లన్నీ సిద్ధమయ్యాయి. కాలువల తవ్వకం ఒక్కటే మిగిలి ఉన్నది. కాంగ్రెస్ సర్కారు కాల్వలు తవ్వడం మాని రూ.2,945.50 కోట్లతో కొత్తగా లిఫ్ట్‌ను చేపట్టేందుకే మొగ్గుచూపుతున్నది. ఆ నిధులతో ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కాల్వల పనులు పూర్తిచేసి నీరివ్వవచ్చు.