CM Revanth Reddy | మహబూబ్‌నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మహబూబాబాద్ (నమస్తే తెలంగాణ): ‘వడ్లకు ఐదువందలు బోనస్ ఇస్తం.. రూ.2లక్షల రుణమాఫీ చేస్తం’ అని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక రైతులను ఇన్నిరోజులూ మభ్యపెట్టి.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు వచ్చాయని మళ్లీ అదే హామీని ఎత్తుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆరు గ్యారంటీలపై ప్రజల్లో నమ్మకం సడలడంతో సాక్షాత్తు భద్రాద్రి రాముడిపైనే ప్రమాణం చేసి వచ్చే వానకాలం పంట నుంచి వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని, ఆగస్టు 15లోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మరోమారు ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు.
శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహించిన ఆయన, సాయంత్రం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. తల్లిని చంపి, బిడ్డను బతికించారని పార్లమెంట్‌లోనే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన మోదీ, ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఓట్లను ఎలా అడుగుతారని ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఈ పదేళ్లలో ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. గిరిజన యూనివర్సిటీని కూడా కాలయాపన చేసి ఇటీవల ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ‘ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తం 42మంది ఎంపీలుంటే కేవలం ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. అదే గుజరాత్లో ఏడు, ఉత్తరప్రదేశ్‌లో 12మందికి కేంద్ర మంత్రి పదవులిచ్చారు.
తెలంగాణకు ఓ న్యాయం, గుజరాత్‌కు మరో న్యాయమా? ఈ దేశమేమన్న మీ అయ్యా జాగీరా?’ అని ప్రశ్నించారు. ఉత్తర భారత దేశంలో కుంభమేళాకు, గంగానది శుద్ధికి వేల కోట్లు ఖర్చుపెట్టారని, మన రాష్ట్రంలో గిరిజన జాతరైన మేడారం మహాజాతరకు ముష్టి రూ.3కోట్లు ఇచ్చారని మండిపడ్డారు. ‘ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాం.. ఏడాది కాలంలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీని భద్రాద్రి రాముల వారి సాక్షిగా కచ్చితంగా మాఫీ చేస్తానని మీకు మాట ఇస్తున్నా’ అని హామీ ఇచ్చారు. వడ్లకు వచ్చే వానకాలం నుంచే రూ.500 బోనస్ ఇస్తామన్నారు.
మానుకోటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు జనం ఆలస్యంగా రావడంతో వారికోసం రేవంత్‌రెడ్డి ఏకంగా గంటన్నరపాటు నిరీక్షించా ల్సి వచ్చింది. మహబూబ్‌నగర్ నుంచి మానుకోటకు వచ్చిన సీఎంను కాంగ్రెస్ నాయకులు సభ వద్దకు రాకుండా అడ్డుగా వెళ్లి ఇంకా జనం రాలేదని, బస్సులో నే వెయిట్ చేయాలని చెప్పారు. సాయంత్రం 3.45 గంటలకు వచ్చిన రేవంత్, 5.15గంటలకు వేదిక పైకి వచ్చి ప్రసంగించారు. కార్యక్రమంలో సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, నాగేశ్వర్రావు, సీతక్క పాల్గొన్నారు.
‘నాతో 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. చిటికె కొడితే వస్తరు అంటున్నవ్.. చిటికె కాదు.. మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డా.. నీ దగ్గర ఉన్నోళ్లు ఎవరైనా ఉంటారేమో చూద్దాం’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌కు హాజరైన రేవంత్ అనంతరం కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ ‘గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్లమంద అనుకొని తోడేళ్లలా వచ్చి కొట్టుకుపోదామని చూస్తున్నారేమో.. ఈడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి.. ప్రయత్నం చేసి చూడు.
మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్లాంటి రేవంత్ ఉన్నాడు.. నువ్వు మా దిక్కు కాదు.. నీ దొడ్ల కట్టేసినవి చూసుకో.. బిడ్డా నీ సంగతి చూస్తా’మంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ‘పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్లమెంట్లో గళం విప్పాలని చూస్తుంటే… గద్వాల గడి నుంచి దొరసాని బయలుదేరింది’ అని డీకే అరుణపై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.