Harish Rao : నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. రూ.2 లక్షల రుణమాఫీతోపాటు రైతులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ధర్నాలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ జరిగే వరకు నేను నిద్రపోను, రేవంత్ రెడ్డిని నిద్రపోనీయను అన్నారు.
రైతుబంధు కేసీఆర్ హయంలో నాట్లకు రైతుబంధు అందిస్తే, ఈ ప్రభుత్వం పంట కోతకు వచ్చినా రైతుబంధు ఇవ్వలేదని మాజీ మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు దొంగరాత్రి కరెంట్ ఇస్తుందని, కానీ కేసీఆర్ కడుపు నిండా 24 గంటల కరెంట్ ఇచ్చిండని అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన 24 గంటల కరెంటు.. ఇప్ప్పుడెందుకు వస్తలేదని ఆయన ప్రశ్నించారు. కరోనా సమయంలోనూ రైతు బంధుకు సమయం ఇచ్చినమన్నారు.
రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, ఈ వానాకాలం ఆయన చెప్పిన రూ.7,500 లేవని, గతంలో ఇచ్చిన రూ.5 వేలు లేవని మండిపడ్డారు. రైతు బంధు ఇవ్వకుండా రైతులను అప్పులపాలు చేస్తున్నారని విమర్శించారు. కుంటిసాకులు, అబద్దాలతో కాలం గడుపుతున్నారని అన్నారు. కేసీఆర్ 11 సార్లు సమయానికి రైతు బంధు ఇచ్చిండని, వడ్లు కొంటే మూడు రోజుల్లో పైసలు వేసిండని చెప్పారు.
కేసీఆర్ రైతు విలువ, రైతు భూమి విలువ పెంచిండని, కానీ కాంగ్రెస్ వచ్చినంక రైతు విలువ తగ్గిందని, భూమి విలువ తగ్గిందని హరీశ్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం కూలిపోయిందంటున్న రేవంత్ రెడ్డి వచ్చి రంగనాయకసాగర్, మాల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ చూడాలని సూచించారు. కాళేశ్వరంలో వంద బాగాలు ఉంటాయని, అందులోని ఒక్క భాగంలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం పోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ వచ్చి కాళేశ్వరం కట్టినంక రైతులు రెండు పంటలు పండిస్తున్నరని చెప్పారు. రెండు లక్షల మాఫీ, వడ్లకు బోనస్ అన్నారని, వచ్చిందా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ అని, ఇప్పుడు సన్నాలు అంటున్నారని మండిపడ్డారు.