Revanth Reddy | హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 13న కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ప్రధాన క్యాంపస్‌ను సందర్శించనున్నారు. ఈ మేరకు సీఎంవో వర్గాలు బుధవారం జేఎన్టీయూ అధికారులకు సమాచారాన్నిచ్చాయి. శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు జేఎన్టీయూ ఆడిటోరియంలో అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలతో సీఎం సమావేశమవుతారు. ఈ సందర్భంగా ‘క్వాలిటీ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్ టెక్నికల్ కాలేజీస్’ అనే అంశంపై సమావేశం నిర్వహించనున్నారు. ఓయూ, జేఎన్టీయూ, కేయూ పరిధిలోని 205 కాలేజీల ప్రతినిధులను ఆహ్వానించారు.
ఇంజినీరింగ్ విద్యలో విద్యాప్రమాణాల పెంపు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి జేఎన్టీయూలో కొత్తగా నిర్మించిన గోల్డెన్‌జూబ్లీ భవాన్ని ప్రారంభిస్తారని ఇన్చార్జి వీసీ బుర్రా వెంకటేశం తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో బుధవారం ఆయన వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్రావు సహా పలు విభాగాల అధికారులతో సమీక్షించారు.
జేఎన్టీయూలో నిర్వహించే సభకు హాజరైన తర్వాత సీఎం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్విస్ అండ్ ఇన్స్యూరెన్స్ పరిశ్రమ నిపుణులతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు, కో ఆర్డినేటర్లు, వలంటీర్లు, పోలీసు అధికారులతో డ్రగ్స్ నియంత్రణ, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, మహిళలు, బాలికల రక్షణ వంటి అంశాలపై చర్చిస్తారు. ‘ఏఐ.. సమాజంపై ప్రభావం’ అనే అంశంపై అధికారులతో సమీక్షిస్తారు