హైదరాబాద్ : తెలంగాణ డీఎస్సీ ఫలితాల(DSC Results) విడుదలపై సస్పెన్స్ వీడింది. పరీక్షలు ముగిసిన 56 రోజుల తర్వాత నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో(Secretariat )2024 డీఎస్సీ పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విడుదల చేయనున్నారు. 11,062 టీచర్ పోస్టులకు గాను మార్చి 1న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదుల చేసింది. జైలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2లక్షల 45 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
కాగా, ఫైనల్ కీ పై అభ్యర్థుల అభ్యంతరాలను పట్టించుకోకుండానే ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. ఇప్పటివరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు. 6న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ తుది ‘కీ’ని విడుదల చేయగా, 210కిపైగా అభ్యంతరాలొచ్చాయి. అభ్యర్థులు పలు పుస్తకాల్లోని ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారుల ముందుంచారు. వాటిని విద్యాశాఖ అధికారులు ఎస్సీఈఆర్టీ పరిశీలనకు పంపించారు. దీంతో కథ మొదటికొచ్చింది. డీఎస్సీ మార్కులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే టెట్ మార్కుల అప్లోడింగ్, సవరణకు విద్యాశాఖ అవకాశమివ్వగా దీంట్లోనూ పలు తప్పిదాలు వెలుగుచూశాయి.
సాంకేతిక సమస్యలతో కొంతమందికి కొత్త మార్కులు అప్లోడ్ చేసినా పాతవే ప్రత్యక్ష్యమయ్యా యి. ఒక సబ్జెక్టుకు పరీక్షరాస్తే మరో సబ్జెక్టు వెబ్సైట్లో చూపించింది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీఈఆర్టీ సబ్జెక్టు నిపుణులు అభ్యంతరాలపై ఓ నివేదికను రూపొందించి విద్యాశాఖ అధికారులకు సమర్పించినట్టుగా తెలిసింది. దీంతోనే ఫలితాల విడుదలపై ఆలస్యం జరిగినట్లు తెలుస్తున్నది.