Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆత్మగౌరవంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతున్నది. కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులు సహా తెలంగాణ సమాజమే వద్దని మొత్తుకున్నా రేవంత్ సర్కారుకు చీమకుట్టినట్టు అయినా లేదు. ఎటూకాని వేళ సచివాలయం ఎదురుగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గుట్టుగా ఏర్పాట్లు చేసింది. ఒకవైపు మిలాద్ ఉన్ నబీ, మరోవైపు వినాయక నిమజ్జనం హడావుడిలో ప్రజలుంటే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించింది. సోమవారం రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.
విచిత్రం ఏమిటంటే.. విగ్రహావిష్కరణకు ఎలాంటి కారణమూ లేదు. రాజీవ్‌గాంధీ జయంతీ కాదు, వర్ధంతీ కాదు. ఆయనకు సంబంధించిన మరో సందర్భం కూడా ఏదీ లేదు. అయినప్పటికీ పంతానికి పోయి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన ప్రదేశంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పేరుతో ఆహ్వానాలు వెళ్లాయి. విగ్రహావిష్కరణను ఎవడు ఆపుతడో చూస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రజలు పండుగ సంబురాల్లో ఉండగా విగ్రహావిష్కరణకు పూనుకోవడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ఆత్మపై సర్కారు ఆడుతున్న ఆటగానే దీనిని పలువురు అభివర్ణిస్తున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎవరి విగ్రహాలు పెట్టినా ఊరుకునేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే తేల్చిచెప్పారు. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మృతి చిహ్నం పక్కన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని.. ఆ స్మృతి చిహ్నం ప్రారంభోత్సవ సభలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందుకోసం సచివాలయం ముందున్న సిగ్నల్ పాయింట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చి రోడ్డును వెడల్పు వేసింది.
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదిత స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించగానే తెలంగాణ సమాజం భగ్గుమన్నది. దీంతో వెనక్కి తగ్గిన రేవంత్‌రెడ్డి సచివాలయం బయట కాదు లోపలే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని హడావుడిగా భూమిపూజ చేసి ప్రజాగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు.
మరోవైపు, ప్రొఫెసర్ హరగోపాల్ సహా తెలంగాణ కవులు, కళాకారులు, పాత్రికేయులు, సాహితీవేత్తలు మొదలుకొని తెలంగాణ మేధో సమాజం రాహుల్‌గాంధీకి లేఖరాసింది. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన ప్రదేశంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయకూడదని, ఒకవేళ చేస్తే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని లేఖలో స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాజీవ్‌గాంధీ విగ్రహా వివాదంలోకి తలదూర్చకూడదని భావించిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ చివరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం సోమవారం నాటి కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది.
రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నెలకొనడంతో గాంధీ కుటుంబం సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. నిజానికి విగ్రహావిష్కరణ విషయంలో రేవంత్‌రెడ్డి అనేకసార్లు వారి వద్ద ప్రస్తావించినా పెద్దగా పట్టించుకోలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే రేవంత్ వారి ఆమోదం ఉందని చెప్పుకునేందుకు తగిన సమయాన్ని ఎంచుకున్నారని చెప్తున్నారు.
సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితులు, రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనలో ఉండటం, వయనాడ్‌లో పోటీచేసేందుకు ప్రియాంకగాంధీ అటువైపు దృష్టిసారించడం, ఇక కర్ణాటకలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై మల్లికార్జున్‌ఖర్గే మంతనాల్లో తలమునకలు కావడం వంటి అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి తనకు అనుకూలంగా మలచుకొని ఇదే సరైన సమయంగా భావించారని పార్టీలో జోరుగా చర్చ సాగుతున్నది.
సీఎం రేవంత్‌రెడ్డికి అటు పార్టీలోను, ఇటు తెలంగాణ సమాజంలో అనుకూల వాతావరణం ఉంటే రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటును ఇంత గుట్టుచప్పుడు కాకుండా, ఎటువంటి ప్రచార పటాటోపం లేకుండా ఎందుకు నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.