హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ‘వర్షాలు, వరదల నేపథ్యంలో మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నా’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినదంతా అబద్ధమేనా? కుంభవృష్టితో చిగురుటాకులా వణుకుతున్న జిల్లాలపై సమీక్షించాల్సిందిపోయి ఆయన సినిమా ఫంక్షన్‌పై దృష్టిపెట్టారా? ఫలితంగా ఖమ్మం ఎన్నడూ లేనంత జలవిలయంలో కూరుకుపోయిందా? ప్రభుత్వం నుంచి సకాలంలో స్పందన లేకపోవటమే విపత్తు తీవ్రతకు కారణమా? అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. రాష్ర్టానికి భారీ వర్షాల ముప్పు ఉన్నదని వాతావరణశాఖ హెచ్చరించినా పట్టించుకోలేదని.. ఆదివారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా.. సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తున్నా.. రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి ఆదివారం రాత్రి 7.30 గంటల తర్వాత హాజరయ్యేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. కార్యక్రమానికి తెలంగాణ సీఎం హాజరవుతున్నట్టు నిర్వాహకులకు సమాచారం కూడా అందింది. సీఎం కార్యక్రమాలను లైవ్ టెలికాస్ట్ చేసే సావీ (ఎస్ఏవీవై) మీడియా ఒక లైవ్ లింక్‌ను సాయంత్రం 5:18 గంటలకు సీఎంవో అధికారిక గ్రూప్‌లో వేసింది.
సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 7.30 గంటలకు బాలకృష్ణకు సంబంధించిన కార్యక్రమానికి హాజరవుతారని అందులో పేర్కొన్నారు. ఈ యూట్యూబ్ చానల్ సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితులదనే ప్రచారం ఉన్నది. అంతేకాదు.. ఎస్ఏవీవై మీడియాకు చెందిన ప్రతినిధులు సీఎం ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చేయటం కోసం ఈవెంట్ జరుగుతున్న ప్రాంతానికి కూడా వెళ్లినట్టు తెలిసింది. అయితే.. అది సినిమా ఫంక్షన్ కావటంతో ఈవెంట్‌కు సంబంధించిన ప్రసార హక్కులను ఓ కంపెనీకి అమ్మేశామని, కాబట్టి లైవ్ టెలికాస్ట్ కుదరదని నిర్వాహకులు అభ్యంతర పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో మాటామాటా పెరిగి, అక్కడున్న బౌన్సర్లు ఎస్ఏవీవై మీడియా ప్రతినిధులను బయటి తోసేశారని ప్రచారం జరుగుతున్నది.
బౌన్సర్ల దాడిలో ఒకరిద్దరు గాయాలతో దవాఖానలో కూడా చేరాల్సి వచ్చిందట. ఏకంగా సీఎం సన్నిహితులకే చెందిన మీడియా సిబ్బందిపై దాడి జరగటంతో సంబంధీకులు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో మనం అధికారంలో ఉండగా మనల్ని ఎలా కొడతారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో సీఎం పునరాలోచనలో పడి వెళ్లేందుకు సిద్ధమైన వ్యక్తి కాస్తా.. ఆగిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరు కావాల్సి ఉన్నది. అయితే ఏపీలో భారీ వర్షాలు, విజయవాడలో వరదల కారణంగా ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో ‘బాబుగారు రావటం లేదు కదా నేను వస్తే బాగుండదు’ అని చెప్పి రేవంత్ కార్యక్రమానికి గైర్హాజరయ్యారట.
నిజానికి రాష్ర్టానికి భారీ వర్షాల ముప్పు ఉన్నదని శనివారమే వాతావరణశాఖ నుంచి ప్రభుత్వానికి హెచ్చరికలు అందాయి. ఆదివారం ఉదయం నుంచే కుంభవృష్టి ప్రారంభమైంది. మధ్యాహ్నానికే వరదలు మొదలై సాయంత్రానికి పరిస్థితి అదుపు తప్పింది. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఇవేమీ పట్టనట్టు సాయంత్రం సినిమా కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమయ్యారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఒకవేళ రేవంత్‌రెడ్డి చెప్తున్నట్టు.. శనివారం రాత్రి నుంచే కంటిమీద కునుకు లేకుండా గడుపుతుంటే.. సహాయ చర్యలపై ఒక్క సమీక్ష గానీ, టెలికాన్ఫరెన్స్ గానీ ఎందుకు జరగలేదన్న ప్రశ్న వినిపిస్తున్నది.
సీఎం వరద సమీక్షల్లో ఉంటే బాలకృష్ణ సినిమా కార్యక్రమానికి హాజరు కానున్నట్టు ప్రభుత్వం అధికారిక మీడియా లింక్ ఎలా విడుదల చేస్తుందని, సదరు మీడియా ప్రతినిధులు ఏకంగా ‘లైవ్’ ఇచ్చేందుకు ఎలా వెళ్తారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ ఆదివారం ఉదయం గానీ, మధ్యాహ్నం గానీ బాలకృష్ణ కార్యక్రమానికి హాజరును రద్దు చేసి ఉంటే సాయంత్రం 5.18 గంటలకు లైవ్ లింక్ పడేది కాదన్నది వారి వాదన. ఒకవేళ పొరబాటు జరిగిందని భావించినా.. ‘సీఎం పర్యటన రద్దయ్యింది’ అని సీఎంవో అధికారిక గ్రూప్‌లో అయినా సమాచారం ఇచ్చేవారని చెప్తున్నారు.
పోనీ నిర్వాహకులకైనా సమాచారం అందేదని అంటున్నారు. కానీ ఇవేమీ జరగలేదంటే.. కచ్చితంగా సినిమా కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం నిర్ణయించుకున్నారని అర్థమవుతుందని నొక్కిచెప్తున్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే.. మూడు రోజులు నిద్రాహారాలు లేకుండా గడిపానని, నిరంతరం సమీక్షించానని చెప్పడం శుద్ధ అబద్ధమని నెటిజన్లు మండిపడుతున్నారు. పైగా ఆదివారం సీఎం ఇంటి నుంచి బయటికే వెళ్లలేదని, కనీసం ఉన్నతాధికారులను పిలిపించుకొని సమీక్షించిన దాఖలాలు కనిపించలేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం వహించటం వల్లే ఖమ్మం మునిగిందని తీవ్రంగా చర్చ జరుగుతున్నది. దానిని కప్పి పుచ్చుకోవడానికే తూతూమంత్రంగా పరామర్శలకు వెళ్లారని, అయినా వైఫల్యంపై విమర్శలు తగ్గకపోవడంతో బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేశారని అంటున్నారు.