CM Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ రెడ్డి పాలన మొత్తం ఇంటి నుంచే నడిపిస్తున్నారు. కొన్ని వారాలుగా ముఖ్యమైన అధికారిక సమీక్షలు, కీలక అంశాలపై పార్టీ ముఖ్యనేతలతో చర్చలన్నీ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలు, వ్యాపారవేత్తలు, అధికారులు.. ఇలా సీఎంను ఎవరు కలువాలన్నా జూబ్లీహిల్స్‌కు వెళ్లాల్సిందే. అభినందనలు, సన్మానాలు, సత్కారాలు అన్నింటికీ సీఎం నివాసమే వేదికగా మారింది. అక్టోబర్ 26న రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు సచివాలయం వైపు రేవంత్‌రెడ్డి కన్నెత్తి చూడలేదు. ‘ఆఫీసుకు సెలవు’ పెట్టారంటూ సచివాలయంలో జోకులు వేసుకుంటున్నారు.
సమీక్షలన్నీ అక్కడే
రెండు నెలలుగా సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి నుంచే పాలన సాగిస్తున్నారు. ఆదివారం బీసీ కులగణనపై సమీక్ష కూడా ఇంటి వద్దే నిర్వహించారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఇంట్లోనే నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 25న స్పోర్ట్స్ పాలసీపై సమీక్ష నిర్వహించారు. నవంబర్ నెలాఖరులోపు డ్రాఫ్ట్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 24న మూసీ రివర్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో విస్తరణపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇం డ్లు ఇవ్వాలని ఆ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 4న విద్యుత్ శాఖపై, 23న ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులపై సమీక్ష నిర్వహించారు. దీనికి డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, ఇతర నేతలను ఇంటికే పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారు.
కలవాలంటే.. చలో జూబ్లీహిల్స్
ఎవరైనా సీఎంను కలవాలంటే జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లాల్సిందే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అధికారిక హోదాల్లో కొత్తగా నియమితులైనవారు కూడా సీఎంను ఆయన ఇంటికి వెళ్లే కలుస్తున్నారు. ఇటీవల నియమితులైన వీసీలు, ఉన్నత విద్యామండలి చైర్మన్ శనివారం జూబ్లీహిల్స్‌కు వెళ్లి సీఎంను కలిశారు. వికారాబాద్‌లో నేవీ రాడార్ స్టేషన్ పనుల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించేందుకు ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీఆర్ సింగ్ అక్టోబర్ 10న సీఎం ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. సెప్టెంబర్ 11న ఏపీ డిప్యూ టీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జూబ్లీహిల్స్‌లో ని రేవంత్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. సెప్టెంబర్ 7న నూతన నియమితులైన బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు వెళ్లి కలిశారు.
ఎవరైనా సరే.. ఇంట్లోనే కలవాలి
సెప్టెంబర్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్సిఫర్ లార్సన్ కూడా సీఎంను ఆయన ఇంట్లోనే కలిశారు. అధికారులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతల ప్రదక్షిణలకు లెక్కే లేదు. భారీ వర్షాలకు నష్టపోయిన ఖమ్మం జిల్లాను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందాయి. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సీఎం నివాసానికి వెళ్లి చెక్కులు అందజేశారు. సీఎం సచివాలయానికి రాకుండా ఇంటికే పరిమితం అవుతున్నారని రాజకీయవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్‌లో సీఎం సచివాలయానికి చాలాసార్లు డుమ్మా కొట్టారని, ఇప్పటికైనా క్రమం తప్పకుండా ఆఫీసుకు రావాలని సూచిస్తున్నారు.
ఇంట్లో సీఎం.. సెలవులో సీఎస్
సీఎస్ శాంతికుమారి వ్యక్తిగత సెలవులపై వెళ్లినట్టు తెలుస్తున్నది. దాదాపు వారం రోజు లు అందుబాటులో ఉండరని సచివాలయ వర్గాలు తెలిపాయి. సీఎస్ సెలవులో ఉన్నప్పు డు బాధ్యతలు మరో సీనియర్ అధికారికి అప్పగిస్తుంటారని, ఈసారి బాధ్యతలు ఎవరికీ ఇవ్వలేదని సమాచారం. సీఎస్ ఇటీవల సీఎంతో పాటు అమెరికాలో పర్యటించిన సమయంలో నూ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు.