హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలను చూసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రులు హైరానాపడ్డారు. ఏడాదిన్నరలో కాంగ్రెస్ సర్కారు చేసిన తప్పులను, ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చీల్చి చెండాడటంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో అలజడి చెలరేగింది. చాలాకాలం తర్వాత బహిరంగసభను నిర్వహిస్తున్న కేసీఆర్.. ఏం మాట్లాడతారో, తమను ఎలా ఎండగడతారోననే ఆందోళనతో ఉన్న మంత్రులు.. ఆదివారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు.
కేసీఆర్ సభ ప్రారంభమైన దగ్గర్నుంచి, చివరి వరకూ.. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్‌లు సీఎం ఇంట్లో టీవీకి అతుక్కుపోయారు. కేసీఆర్ ప్రసంగానికి కచ్చితంగా కౌంటర్ ఇవ్వాలని మంత్రివర్గంపై సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీంతో ఎల్కతుర్తిలో కేసీఆర్ ప్రసంగం కొనసాగుతుండగానే.. మీడియా ప్రతినిధులకు ‘సీఎం, మంత్రుల మీడియా సమావేశం ఉన్నది’ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం వచ్చింది. కేసీఆర్ సభ పూర్తయిన మరుక్షణమే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్‌రెడ్డి ఆగమేఘాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఇంటినుంచి బయటకి వచ్చి.. మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మీద అక్కసు వెళ్ల్లగక్కారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే ముగించి మళ్లీ సీఎం ఇంట్లోకి వెళ్లిపోయారు. మీడియా మీటింగ్‌కు సీఎం వస్తారని మొదట సమాచారం వచ్చినా.. ఆయన రాలేదు. మంత్రు ల తర్వాత ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, విప్ రాంచందర్‌నాయక్ మాట్లాడి తమ అక్కసు వెళ్లగక్కారు.