Revant Reddy X KTR | హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మధ్య వాదోపవాదాలు ఆసక్తికరంగా జరిగాయి. ఇద్దరు నేతలూ విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోయారు. సీఎం చేసిన పలు వ్యాఖ్యలను కేటీఆర్ ఘాటుగా తిప్పికొట్టారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సీఎం తిప్పి కొడుతూ ఆయనను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. కొన్ని అంశాల మీద ఇద్దరు నేతల మధ్య జరిగిన చర్చ ఇలా కొనసాగింది.
గత ప్రభుత్వంలో ఇసుకను దోపిడీ చేశారు. ప్రశ్నించిన దళితులపై దాడులు చేశారు. నేరెళ్ల ప్రజలను కేసులు పెట్టి హింసించారు. దళితులను లాకప్లలో పెట్టి.. కరెంట్ షాక్ ఇచ్చి హింసించారు : సీఎం రేవంత్రెడ్డి
గతంలో ఇసుక ఆదాయం కాంగ్రెస్ నేతల జేబుల్లోకి పోయిందా..: కేటీఆర్
నేరెళ్లలో ఏదో జరిగినట్టు శాండ్ మాఫియా అంటున్నారు. ఇసుక మీద 2004 నుంచి 2014 వరకు వచ్చిన ఆదాయం రూ.39.5 కోట్లు. అంటే ఏటా కనీసం రూ.4 కోట్లు కూడా రాలేదు. 2014 నుంచి 2023 వరకు ఇసుకపై ఆదాయం రూ.5 వేల కోట్లకుపైగా వచ్చింది. శాండ్ మాఫియా ఎవరిది? ఆనాడు ఇసుక ఆదాయం ఎక్కడికి పోయింది? కాంగ్రెస్ నేతల జేబుల్లోకి పోయిందా? నేరెళ్లలో ఏదో జరిగిందని పాత చింతకాయ పచ్చడి మాటలే చెప్తున్నరు. అదే నేరెళ్ల ఉన్న నియోజకవర్గం నుంచి ప్రజలు మరోసారి న న్ను గెలిపించారు. అధికారం మీ చేతుల్లోనే ఉంది.. ఏ విచారణ చేసుకుంటారో చేసుకోవాలి.
పంటల బీమాకు, రైతుబీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎం…: కేటీఆర్
పంటల బీమాకు, రైతుబీమాకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు తాను నిజంగానే సిగ్గుపడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. రేవంత్రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా, టీపీసీసీ అధ్యక్షుడిలా గాంధీభవన్లో కూర్చొని మాట్లాడుతున్నట్టు చాలా దారుణంగా మాట్లాడుతున్నారని విమర్శించా రు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఇది తగదని, పంట బీమాకు, రైతుబీమాకు తేడా తెలియని వ్యక్తి ఆ పదవిలో కూర్చొవడంతో రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మేనేజ్మెంట్ కోటాలో పదవి పొందాలనుకుంటే కేటీఆర్కు నిరాశ ఎదురైంది. పదవి దక్కలేదనే నిరాశతోనే కేటీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారు.
మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్లతో ఇదే ఇబ్బంది: సీఎం రేవంత్
ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ, సీఎం పదవి తెచ్చుకున్నదెవరో..?: కేటీఆర్
మాట్లాడితే మేనేజ్మెంట్ కోటా అంటున్నరు. ఢిల్లీని మేనేజ్ చేసి సీఎం పదవి తెచ్చుకున్న వ్యక్తి, ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ పదవి తెచ్చుకున్న వ్యక్తి ఎవరో.. అలాంటి వ్యక్తి ఈరోజు మేనేజ్మెంట్ కోటా గురించి మాట్లాడితే ఎట్లా? మేము కూడా అదే చెప్తున్నాం తెలంగాణ ప్రజలు కోరుకున్న సీఎం కాదు.. ఢిల్లీ నామినేట్ చేసిన సీఎం అనే అంటున్నాం.
రాష్ట్రంలో నిర్బంధ పాలన పోయింది. మార్పు మొదలైంది: సీఎం రేవంత్రెడ్డి
2014 జూన్ 2నే మార్పు మొదలైంది.. తెలంగాణ నిర్బంధం వీడింది..: కేటీఆర్
అవును నిజమే మార్పు మొదలైంది. నిర్బంధం పోయింది. 2014 జూన్ రెండునే దాస్యశృంఖలాల నుంచి తెలంగాణకు విముక్తి లభించింది. ఆ రోజునే నిర్బంధం పోయింది. దరిద్రం ఏంటంటే.. గతంలో మనల్ని పీడించిన వాళ్లు పోయారు. కానీ వాళ్ల పేర్లు తలుచుకునే వారు ఇంకా ఇక్కడే ఉన్నారు.
కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే అర్థం తెలియటం లేదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకోరు. ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్. ఎన్ఆర్ఐలతో వచ్చిన ఇబ్బందే ఇది. వాళ్లకు ఏ విషయాలూ తెలియవు.: సీఎం రేవంత్రెడ్డి
ఎన్నారైలకు టికెట్లు అమ్ముకున్నదెవరో: కేటీఆర్
ఎన్నారైలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరు? ఎన్నారైలు ఎవరు? 100 కోట్ల భారతీయులను కాదని, బయటి దేశం వాళ్లను అధ్యక్షులుగా చేసుకున్న కాంగ్రెస్.. ఎన్నారైల గురించి మాట్లాడితే ఎట్లా?
చీమలు పెట్టిన పుట్టలో పాములు చొచ్చినట్లు. ఎవరో పెట్టిన బీఆర్ఎస్ పార్టీలో వీరంతా చేరారు: సీఎం రేవంత్రెడ్డి
కాంగ్రెస్లో దూరి సీఎం అయ్యిందెవరో: కేటీఆర్
చీమలు పెట్టిన పుట్ట.. కాంగ్రెస్లో మా భట్టి అన్న, మా శ్రీధర్ అన్న, మా దామోదరన్న, మా ప్రభాకరన్న, మా కోమటిరెడ్డన్న, మా ఉత్తమ్ అన్న.. ఇలా వీళ్లందరు కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి సీఎం పదవి తీసుకున్న వారు చీమలు పెట్టిన పుట్టలో పాములు దూ రాయనడం ఛండాలంగా ఉంటుంది.
ఇందిరమ్మ రాజ్యం తెస్తాం: సీఎం రేవంత్రెడ్డి
ఇందిరమ్మ రాజ్యమంటే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, దళితులు, గిరిజనులకు అసైన్డ్ భూములిస్తాం, పోడు పట్టాలిస్తాం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, పేదలకు ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు ఇస్తాం.
నియంతృత్వం, పేదరికం ఇదేనా ఇందిరమ్మ రాజ్యం: కేటీఆర్
ఇందిరమ్మ రాజ్యమేందో గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇందిరమ్మ పాలనలో గంజి కేంద్రాలున్న విషయం గుర్తుచేయాలి, కరెంట్లేనిది గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ని ర్బంధాలను గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలన లో నియంతృత్వాన్ని గుర్తు చేయాలి, ఇందిర మ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు చే యాలి, ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ 365ని దుర్వినియోగం చేసి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఏ విధంగా రద్దు చేశారో గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ముల్కీ రూల్ ను ఏ విధంగా తుంగలో తొక్కారో గుర్తు చేయా లి, ఇందిరమ్మ పాలనలో ఇంటింటికి తాగునీరు ఇవ్వలేని దుస్థితిని గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఇచ్చిన గరిబీ హఠావో నినాదాన్ని ఏ విధంగా మర్చిపోయారో గుర్తు చేయాలి.
రైతుల గురించి అన్నీ అబద్ధాలే : సీఎం రేవంత్
రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న రైతుబీమా పథకం ప్రకారం 1,21,965 మంది మరణించారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కావా? ఇదా రైతు ప్రభుత్వం. పంటలకు బీమా ఉండాలే తప్ప.. రైతు చనిపోయిన తర్వాత ఏం ఇచ్చినా ఏం లాభం లేదు.