హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ‘చామలను గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటే.. మిమ్మల్ని చూసుకునే బాధ్యతను నేను తీసుకుంటా’నంటూ మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన రాజగోపాల్‌రెడ్డిని బుజ్జగించేందుకు రేవంత్‌రెడ్డి పలుమార్లు ఆయనతో చర్చించి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు.
బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రాజగోపాల్‌రెడ్డి ఇంట్లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. అందు లో భాగంగా చామలను గెలిపించే బాధ్యతను కోమటిరెడ్డికి అప్పగించినట్టు తెలిసింది. రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ 21న కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ వేస్తారని, భువనగిరిలో పార్టీ అభ్యర్థిని రెండులక్షల మెజార్టీతో గెలిపిస్తానని రేవంత్‌కి హామీ ఇచ్చినట్టు చెప్పారు.