హైదరాబాద్ సిటీబ్యూరో, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): చుట్టూ ఇనుప కంచెలు.. లోపలికెళ్లే దారులన్నీ దిగ్బంధం.. మూడుకిలోమీటర్ల మేర పోలీస్ వలయం.. ట్రాఫిక్ ఆంక్షలు.. విద్యార్థుల ముందస్తు అరెస్టులు.. గృహ నిర్బంధాలు.. ఇవీ ప్రజాస్వామిక ఉద్యమాలకు ఆలవాలమైన ఓయూలో సోమవారం చోటుచేసుకున్న పరిస్థితులు. వర్సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా అప్రకటిత నిషేదాజ్ఞలు అమలయ్యాయి. దీంతో ‘మాది ప్రజాపాలన అంటూ తరచూ చెప్పే.. రేవంత్‌రెడ్డి నియంతృత్వ పాలనకు పరాకాష్టకు చేరింది. నిషేధిత ప్రాంతానికి వెళ్లినంత బందోబస్తును సీఎం పెట్టుకుని ఓయూకు వెళ్లారు. పోలీసు బలగాలు రెండు రోజుల ముందుగానే క్యాంపస్‌లో మోహరించాయి. క్యాంపస్ పరిసరాల్లో 10 అడుగుల ఎత్తయిన పటిష్టమైన ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఉద్యమ కాలంలో ఆంధ్ర పాలకులు కూడా విధించనంత కఠినమైన ఆంక్షలను వర్సిటీలో విధించారు. అసలు మేము ప్రజాస్వామిక ప్రాంతంలోనే ఉన్నామా? అంటూ ఓయూ విద్యార్థుల ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు. మార్పు అంటూ గెలిచారు.. మీరు తెచ్చిన మార్పు ఇదేనా? అని నిలదీస్తున్నారు.
బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిన హాస్టల్ ప్రారంభం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన హాస్టల్ ‘దుందుభి’కి చేరుకున్న సీఎం రేవంత్ అదే ఆవరణలో నిర్మించిన భీమ హాస్టల్‌ను కూడా ప్రారంభించారు. ఒక బాలుర హాస్టల్, మరో బాలికల హాస్టల్, రీడింగ్ రూమ్, డిజిటల్ లైబ్రెరీ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఉస్మానియాకు తాను డిసెంబర్లో మళ్లీ వస్తానని, అప్పుడు మాత్రం ఇనుప కంచెలు, నిర్బంధాలు ఉండవని చెప్పకనే చెప్పారు.
యూనివర్సిటీ అభివృద్ధికి మొండిచేయి.
ఓయూకు సీఎం రేవంత్ వస్తున్నారన్న సమాచారంతో వర్సిటీ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన వారికి ఆశాభంగమైంది. మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తారని, బోధన, బోధనేతర ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తారని భావించినప్పటికీ, ఆ దిశగా సీఎం ఎటువంటి ప్రకటన చేయలేదు. వర్సిటీకి రూ.1,000 కోట్లు కేటాయిస్తారని, పరిశోధక విద్యార్థులకు నెలకు రూ.20 వేల ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభిస్తారని అనుకూల మీడియాలో ఊదరగొట్టినా అలాంటిదేమీ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ బకాయిలపై మాట్లాడకపోవడం మరీ దారుణమని విద్యార్థిలోకం మండిపడుతున్నది.
భద్రతా సిబ్బందికి 24 గంటల విధులు..గుండెపోటుతో ఒకరి మృతి
సీఎం పర్యటన నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బందికి 24 గంటల డ్యూటీ వేశారు. ఈ నేపథ్యంలో విధినిర్వహణలో ఉన్న ఓయూ భద్రతా సిబ్బంది (సహారా సెక్యూరిటీ సర్వీసెస్) మురళీరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. డీ హాస్టల్ వద్ద సెక్యూరిటీగా చేసే మురళీరెడ్డిని ఠాగూర్ ఆడిటోరియానికి వెళ్లే దారిలో డ్యూటీ వేయగా, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు గుండెనొప్పిగా ఉన్నదని ఇన్చార్జికి చెప్పగా, విధులు పూర్తయ్యాకే వెళ్లాలని స్పష్టంచేసినట్టు సమాచారం. దీంతో గుండెపోటు తీవ్రమై అక్కడే కుప్పకూలడంతో గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మురళీరెడ్డి కన్నుమూశారు. దీనిపై అధికారులు గోప్యతను పాటిస్తున్నారు. మురళీరెడ్డి మృతిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.