ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 3: లిఖిత చరిత్ర లేని బంజారా గిరిజన తెగ ఘనమైన చరిత్రను పుస్తకరూపంలో సమాజానికి అందించడం అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) తెలుగు విభాగం ప్రొఫెసర్ సూర్యాధనంజయ్, మాజీ సీటీవో డాక్టర్ ధనంజయ్‌నాయక్ సంయుక్తంగా రచించిన ‘బంజారా చరిత్ర’(Banjara history )పుస్తకాన్ని ముఖ్యమంత్రి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం రచయితలు మొదటి ప్రతిని రేవంత్‌రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బంజారాల చరిత్ర ఎంతో గొప్పదని అన్నారు. బంజారాల చరిత్రను గ్రంథస్తం చేసేందుకు విశేష కృషి చేసిన రచయితలను అభినందించారు. అనంతరం రచయితలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసి, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.