Revanth Reddy | రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. లక్షల అక్షరాలతో రాసినా.. కోట్ల పదాలను కూర్చి చెప్పినా.. తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం అని తెలిపారు. నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు.
ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో, ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో, మీ అందరి ఆశీర్వాద బలంతో భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా,ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా.. అన్నింటికీ మించి రేవంతన్నగా.. మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇచ్చారు.