హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చొద్దని సీపీఎం ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కోరగా.. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డితో కూడిన పార్టీ ప్రతినిధి బృందం శనివారం రాత్రి హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసింది. ట్రిపుల్ ఆర్ భూసేకరణతోపాటు పలు అంశాలతో కూడిన వినతిపత్రం సమర్పించామని వారు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అలైన్మెంట్ మార్చడం వల్ల మధ్యతరగతి ఉద్యోగులు, రైతులు, పేదలు నష్టపోతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పాత అలైన్మెంట్ ప్రకారమే ప్రభుత్వం ముందుకు పోవాలని కోరారు.
దీనిపై సీఎం స్పందిస్తూ.. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుపై నిర్ణయం జరిగినట్టు తెలిపారు. వెనకి వెళ్లడం కష్టమని తేల్చి చెప్పారు. కావాలంటే బాధితులకు నష్టపరిహారం పెంచే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారని సీపీఎం నేతలు పేరొన్నారు. హనుమకొండ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయానికి ఆనుకొని 40 ఏండ్లుగా నివసిస్తున్న టీచర్లు, కాంట్రాక్టు కార్మికులు, ఆటో డ్రైవర్ల ఇండ్లను యూనివర్సిటీ స్థలం పేరుతో కూల్చివేస్తామని మున్సిపల్ అధికారులు బెదిరిస్తున్నారని సీపీఎం నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అది ప్రైవేట్ స్థలమని, వర్సిటీకి సంబంధం లేదని చెప్పారు. ఉద్యోగులు, కార్మికుల ఇండ్లను కూల్చవద్దని కోరారు. సిరిసిల్లలో పవర్‌లూమ్‌ల కరెంటు చార్జీలను ప్రభుత్వం రూ.2 నుంచి రూ.8.30కు పెంచడంతో 30 వేల మంది కార్మికులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. పవర్ లూమ్‌లు మూతపడి, కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని వాపోయారు. కరెంట్ రాయితీని కల్పించాలని కోరారు. గతంలోలాగా యూనిట్‌కు రూ.2 వసూలు చేసి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.