రంగారెడ్డి, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): అనాలోచిత నిర్ణయాలు, అలసత్వ విధానాలతో నగరాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఫ్యూచర్ సిటీ పేరుతో గాలిమేడలు కడుతున్నది. ఈ మేరకు ఆర్భాటపు చర్యలతో హడావుడి చేస్తున్నది. ఫార్మాసిటీ భూముల్లో ఫార్మా అనుబంధ సంస్థలను మాత్రమే ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు తెలియజేసిన రేవంత్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం రైతులను మోసం చేసేందుకు సిద్ధమైంది. ఫార్మా భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తామంటూ హామీని తుంగలో తొక్కుతూ ఫ్యూచర్‌సిటీ పేరుతో కొత్త ఎత్తుగడను చేపట్టింది.
ఈ మేరకు భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ సమీపంలో సర్వేనెంబర్ 112లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ఫార్మాసిటీ కోసం భూమి సేకరించింది. రైతులకు టీఎస్ఐఐసీ పరిహారం చెల్లించింది. కానీ ఫార్మాసిటీని రద్దుచేస్తే ఆ భూములను తిరిగి తమకు అప్పగించాలని రైతుల నుంచి డిమాండ్ పెరిగింది. కానీ కాలుష్యరహిత ఫార్మా కంపెనీలకు మాత్రమే ఈ భూములను వినియోగిస్తామని ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ ఫ్యూచర్‌సిటీకి వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నది.
నేడు భవనాలకు భూమిపూజ
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ వద్ద ఫార్మాసిటీ కోసం సేకరించిన 112 సర్వేనంబర్‌లోని సుమారు ఏడు ఎకరాల్లోనే ఫ్యూచర్‌సిటీ కార్యాలయ భవనానికి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. భవనం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు ఐదుకోట్లకు పైగా నిధులు కేటాయించింది. ఏడు ఎకరాల్లో ఈ భవనాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. రైతుల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మీర్ఖాన్పేట్ పరిసరాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. శంకుస్థాపన అనంతరం సీఎం సభను ఏర్పాటు చేయనున్నారు.
కాంగ్రెస్ మాటలకు,చేతలకు పొంతనలేదు
ఫ్యూచర్‌సిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమై న విధానం లేదు. ఫార్మాసిటీ కోసం సేకరించి న భూముల్లో ఫార్మా అనుబంధ కంపెనీలు మాత్రమే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు స్పష్టంచేసింది. ఫ్యూచర్‌సిటీ ఏర్పాటుకు సంబంధించి, ఇప్పటివరకు డీపీఆర్ కూడా సిద్ధం కాలేదు. ఈ పరిస్థితిలో ప్రజలను మభ్యపెట్టడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీని తెరమీదకు తీసుకువస్తున్నది.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
ఫ్యూచర్‌సిటీకి ఎలా ఉపయోగిస్తారు?
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఫార్మా కంపెనీలకే కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ కోసం ఎలా ఉపయోగిస్తుంది? ఫార్మాసిటీని రద్దుచేసి, ఆ భూములను తిరిగి రైతులకే ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఫార్మాసిటీని రద్దు చేయలేదని కోర్టుకు చెప్పింది. ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించడంలేదు. ఫార్మాసిటీ భూముల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలి. ఫార్మాసిటీని రద్దుచేస్తే ఆ భూములను రైతులకే ఇవ్వాలి.
-దుబ్బాక రాంచంద్రయ్య, మీర్ఖాన్పేట్