ITDA | హైదరాబాద్, మే17(నమస్తే తెలంగాణ): ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 150 చెంచుపెంటల్లో కలిపి 14,436 మంది చెంచులు జీవిస్తున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. వీరి సంక్షేమం కోసం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేసింది. చెంచుల జనాభా, పెంటల విస్తరణను బట్టి ఐటీడీఏలో ఒక పీవో, ఏపీవో జనరల్, ఏపీవో విద్య, కార్యాలయ మేనేజర్, అకౌంట్స్ మేనేజర్, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు వ్యవసాయాధికారులు, ఐదుగురు వ్యవసాయ విస్తరణాధికారులు, వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఇద్దరు హెడ్నర్సులు, 8 మంది స్టాఫ్ నర్సులు, ఇంజినీర్ తదితర అధికారుల అవసరం ఉన్నది. కానీ, ఐటీడీఏ మన్ననూరు కార్యాలయంలో ఒకే ఒక సీనియర్ అసిస్టెంటు మాత్రమే పనిచేస్తున్నారు. ఈ ఒక్క ఉద్యోగికి మూడు ఉమ్మడి జిల్లాల్లో చెంచుల పథకాల పర్యవేక్షణ కష్టంగా మారుతున్నది. కోట్లకు కోట్లు కరిగిపోతున్నా చెంచులకు గుప్పెడు పోషకాహారం, గుక్కెడు రక్షిత తాగునీరు అందించలేని దుస్థితిలో ఐటీడీఏ ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు జిల్లా సున్నిపెంటలో ఐటీడీఏ ఉండేది. దీంతో సమస్యల పరిష్కారం కోసం 70 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. మన్ననూరులో ఐటీడీఏ ఏర్పాటుతో సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన చెంచులకు నిరాశే మిగిలింది. ఐటీడీఏ ఏర్పాటైనా అధికారులు లేకపోవడంతో సంక్షేమ పథకాలు చెంచులకు చేరడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అచ్చంపేట పరిధిలో రూ. 12 లక్షలు మాత్రమే విదిలించి కొన్ని చెంచు పెంటలకు తాగునీటి వసతి కల్పించినట్టు స్థానికులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ అటవీప్రాంతంలోని మాచారం గ్రామంలో ‘ఇందిరా సౌరగిరి జల వికాస’ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం కింద రాబోయే ఐదేండ్లలో రూ. 12,600 కోట్లతో గిరిజన రైతులకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాగునీరు అందించని చోట, సాగునీటి పథకం ప్రారంభిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
చెంచుల కోసం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధానమైన వ్యవసాయం, పండ్ల తోటల పెంపకం, వైద్య ఆరోగ్యం, ఉపాధిహామీ, స్వయం సహాయక సంఘాలు, పెసా చట్టం అమలు, స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమాలు, అటవీ ఆధారిత పథకాలు, విద్య, సాగునీరు భూ అభివృద్ధి, గృహనిర్మాణం, ఇంజినీరింగ్ విభాగం, గిరిజన సహకార సంస్థ కార్యక్రమాలను ఇతర శాఖలతో సమన్వయం చేస్తూ చెంచుల సంక్షేమ పథకాలను అమలు చేయడమే ఐటీడీఏ పని. జీవో నంబర్ 57 ప్రకారం ప్రిమిటివ్ ప్రాంతం అంతా సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేష్టన్ కిందికి వస్తుంది. అన్ని ప్రభుత్వ శాఖలు ఐటీడీఏ పీవో పరిధిలోకి వస్తాయి. పీవో ఆదేశాల మేరకు వారు పనిచేయాల్సి ఉంటుంది. గిరిజనుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించినా, కేటాయించకపోయినా ప్రతి ఏడాది ఐటీడీఏకు జిల్లా పరిషత్ ఇయర్మార్క్ ఫండ్, మండల పరిషత్ ఇయర్మార్క్ ఫండ్, కేంద్ర ప్రభుత్వం నుంచి సీసీడీపీ ఫండ్ ఉంటుందని, ఐటీడీఏకు రెగ్యులర్ పీవో నిధులపై సమీక్ష చేసి ఆయా జిల్లా పరిషత్తుల నుంచి, మండల పరిషత్తుల నుంచి రావాల్సిన బకాయిలను చెంచుల సంక్షేమం కోసం ఉపయోగించుకునేవారని ప్రజా సంఘాల నేతలు చెప్తున్నారు. రెగ్యులర్ అధికారులు లేక దిగువస్థాయి అధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దీంతో పథకాల అమలు నత్తనడకన సాగుతున్నది. అత్యవసర సమయాల్లో తక్షణ సాయం అందక చెంచులు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా వైద్యం, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచులు తాగునీటి కోసం చెలిమెలపైనే ఆధారపడుతున్నారు. దీంతో చెంచుల జీవన ప్రమాణాలు వేగంగా పడిపోతున్నాయి. పోషకాహార లోపం, రక్తహీనత, అనార్యోగాలతో 50 ఏళ్లలోపే గిరిజనులు చనిపోతున్నారని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
గతంలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నల్లమల అటవీప్రాంతం నుంచి 16 పెంటల చెంచులను బలవంతంగా తీసుకొచ్చి మొలచింతలపల్లి సమీపంలోని భ్రమరాంబిక కాలనీలో వదిలిపెట్టారు. వారికి ప్రభుత్వం ఎలాంటి ఆశ్రయం కల్పించలేదు. ఆర్డీటీ ముందుండి వారికి ఇండ్లు కట్టించింది. ఆ తరువాత కుటుంబంలో ఉన్న జనాభాను బట్టి ఒక్కో చెంచు కుటుంబానికి ప్రభుత్వం 3 నుంచి 5 ఎకరాల చొప్పున పోడు పట్టాలు ఇచ్చింది. ఇంకొందరికి ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూమిని పంచి ఇచ్చారు. అనంతరం వారిని మరిచిపోయారు. ఇప్పుడా భూములను ప్రభుత్వానికి అమ్మిన వ్యక్తులే ఆక్రమించి, చెంచుల ఇండ్ల వరకు వదిలేసి మొత్తం భూమిని దున్నుకోవడం మొదలు పెట్టారు. కనీసం కాలిబాటకు తొవ్వ కూడా ఇవ్వలేదు. చేతిలో పట్టాలు గానీ, ప్రభుత్వం చెంచులకు ఇచ్చినట్టు ఆధారాలు గానీ లేకపోవడంతో చెంచులు నిస్సహాయతలో ఉండిపోయారు. ఉపాధి లేక చెంచులు అదే పంట పొలాల్లో వ్యవసాయ కూలీలుగా కాలం గడుపుతున్నారు. అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారు. సరైన వైద్యం, పిల్లలకి చదువుకోడానికి సరైన పాఠశాలలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఐటీడీఏ బలంగా ఉండి ఉంటే ఈ అన్ని పెంటల మీద పర్యవేక్షణ ఉండేది. అది లేకపోవటంతో అనాథలుగా గడపాల్సి వస్తున్నదని ఈదయ్య అనే చెంచు పెద్ద ఆవేదన వ్యక్తంచేశాడు.
రాష్ట్రంలో ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, మన్ననూరు ఐటీడీఏలు ఉన్నాయి. మన్ననూరు మినహాయిస్తే మిగతా మూడు ఐటీడీఏల్లో 208 పోస్టులకు గాను 116 ఖాళీగా ఉన్నాయి. కేవలం 92 మంది అధికారులు, ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. మంత్రి సీతక్క ఇలాకాలోనూ ఇదే తంతు. ఏటూరునాగారం ఐటీడీఏలో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు(ఈఈ) పోస్టు కూడా ఖాళీగానే ఉన్నట్టు సమాచారం. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యను పర్యవేక్షించే జిల్లా గిరిజన సంక్షేమాధికారులు, ఉపసంచాలకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్(ఉట్నూరు ఐటీడీఏ), మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఒకే అధికారి ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉట్నూరు, బోథ్, ఆదిలాబాద్, మంచిర్యాల, కాగజ్నగర్, జైనూరులో సహాయ గిరిజన సంక్షేమాధికారి(ఏటీడీవో) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉట్నూరులో వ్యవసాయ, మత్స్యశాఖ, ఉద్యానశాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉట్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్లో డిప్యూటీ ఇంజినీరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఇల్లెందులో ఏటీడీవో పోస్టు, అశ్వారావుపేటలో డిప్యూటీ ఇంజినీరు, వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.