హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 52వసారి కావడం గమనార్హం. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ హాజరుకానున్నారు. ఇండియా కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేయడంపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును తానే ప్రతిపాదించినట్టు రేవంత్‌రెడ్డి చెప్పుకుంటున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీసీ నినాదం ఎత్తుకున్న రేవంత్‌రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని కాకుండా ఓసీ వర్గానికి చెందిన వ్యక్తి పేరును ప్రతిపాదించడంపై రాజకీయ నిపుణుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలని రేవంత్‌రెడ్డి ఇటీవల బీజేపీని డిమాండ్ చేశారు. బీసీని ఉపరాష్ట్రపతిగా నియమించాలని డిమాండ్ చేసిన వ్యక్తి.. ఓసీ పేరును ప్రతిపాదించడం ఏమిటని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎలాగూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమయ్యారు, కనీసం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎంపిక చేస్తే వారికి న్యాయం చేసినట్టు ఉండేదనే అభిప్రాయాన్ని రాజకీయ నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన వారిని ఎంపిక చేసే అవకాశం రేవంత్‌రెడ్డికి ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేయలేకపోయారని అభిప్రాయపడుతున్నారు.