హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ): కులగణనపై కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జనగణనతోపాటు కులగణన చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పారదర్శకంగా పూర్తిచేసిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు.
ఈ విధానాన్ని కేంద్రం రోల్‌మోడల్‌గా తీసుకోవాలని సూచించారు. కులగణనపై మంత్రులతో, అధికారులతో వేర్వేరు కమిటీలు వేసి రాష్ర్టాల అభిప్రాయాలతోపాటు అన్నివర్గాల అభిప్రాయాలను సేకరించాలని కోరారు. విధి విధానాలను కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కులగణనను ఏడాదిలోపు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 400 సీ ట్లు వచ్చుంటే రాజ్యాంగాన్ని మార్చేసేదని, కులగణన ప్రస్తావనే ఉండేదికాదని తెలిపారు.
స్థానిక ఎన్నికలకు, కులగణనకు సంబంధమే లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. కులగణన చేపట్టనున్నట్టు కేంద్రం నిర్ణయించడంతో తెలంగాణలో చేసిన కులగణన పరిస్థితి ఏమిటని, దీనిద్వారా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా? అని సీఎంను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఇప్పుడు ఆ ప్రశ్నతో సంబంధమే లేదని దాటవేశారు. కులగణనకు, ఎన్నికలకు సంబంధం లేదని చెప్పారు.