RRR | హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : రీజనల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం ప్రతిపాదిత అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ట్రిపుల్ ఆర్ మొత్తం మ్యాప్‌ను గూగుల్‌లో పరిశీలించిన ఆయన, భవిష్యత్తు అవసరాల ప్రాతిపదికగా అలైన్మెంట్ ఉండాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. భూములు ఇచ్చే రైతులకు న్యాయం చేస్తూ సేకరణ ఉండాలని చెప్పారు. మార్పులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను త్వరగా అందజేయాలని ఆదేశించారు. ట్రిపుల్ ఆర్ ప్రగతిపై సచివాలయంలో సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. దక్షిణ భాగం పరిధిలోని సంగారెడ్డి-ఆమన్‌గల్ -షాద్‌నగర్ -చౌటుప్పల్ (189.20 కి.మీ.) మార్గానికి భూసేకరణ ప్రారంభించాలని ఆదేశించారు. ఉత్తర భాగంలో ఇప్పటికే చాలావరకు పూర్తయినందున, దక్షిణ భాగంలోనూ ప్రారంభించాలని, ఏవైనా సాంకేతిక , ఇతర సమస్యలుంటే కేంద్రంతో చర్చించాలని సూచించారు.
సీఎస్‌తోపాటు మౌలిక వసతు లు, ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాస రాజు, ముఖ్యమంత్రి ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్అండ్బీ ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అప్డేట్ చేయాలని సూచించారు. రేడియల్ రోడ్ల నిర్మాణంపైనా సీఎం పలు సూచనలు చేశారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఈ రోడ్ల ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. రహదారుల అనుసంధాన ప్రదేశాలను ముందుగానే గుర్తించాలని, సిగ్నల్, ఇతర సమస్యల్లేకుండా సాఫీ గా ప్రయాణం సాగేందుకు వీలుగా నిర్మాణా లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రేడియల్ రోడ్లు ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ అనుసంధానానికి అనువుగా ఉండాలని చెప్పారు. ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ , సీఎం ప్రత్యేక కార్యదర్శి వీ శేషాద్రి, సీఎం ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన పాల్గొన్నారు.