CM Revanth Reddy | హైదరాబాద్/యాదాద్రి భువనగిరి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని పదేండ్లు పాలించిన కేసీఆర్, మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పుట్టిన రోజునాడే దుర్భాషలాడారు. సమయం దొరికినప్పుడల్లా ప్రతిపక్ష నేతపై నోరు పారేసుకునే సీఎం తన పుట్టిన రోజున కూడా నోరును అదుపులో పెట్టుకోలేకపోయారు. బుల్డోజర్లతో తొక్కిస్తామని, మూసీలో పారేస్తామంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంపై తెలంగాణ సమా జం నివ్వెరపోతున్నది. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో నిర్వహించిన మూసీ పునరుజ్జీవ పాదయాత్ర అనంతరం సీఎం రేవంత్ ప్రసంగిస్తూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై తీవ్ర విమర్శలు చేశారు. మూసీని ప్రక్షాళన చేసి తీరుతానని, మూసీ అభివృద్ధికి ఎవరెవరు అడ్డుపడతారో పేర్లు ఇస్తే నల్లగొండ జిల్లా ప్రజలతో బుల్డోజర్ తొక్కించకపోతే తన పేరు మార్చుకుంటానని శపథం చేశారు. కేటీఆర్, హరీశ్ అడ్డుపడితే మంత్రి కోమటిరెడ్డిని బుల్డోజర్ ఎక్కించి ఎమ్మెల్యే సామేల్‌తో జెండా ఊపిస్తానని హెచ్చరించారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే నల్లగొండ ప్రజలు మూసీలోనే పాతరేస్తారని పేర్కొన్నారు. నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యతో పుట్టెడు దుఃఖం పడుతుంటే కలిసిరావా? మూసీ పునరుజ్జీవ పథకానికి కలిసిరాకపోతే మూసీ మురికిలో పడి కొట్టుకపోతవు. దిక్కులేని చావు చస్తావ్ అని పరుష వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం స్థానంలో ఉన్న రేవంత్‌రెడ్డి హుందాగా వ్యవహరించడం మాని బజారు భాష మాట్లాడటంపై ముక్కున వేలేసుకుంటున్నారు.
ఫ్లోరైడ్ భూతాన్ని తరిమిందే కేసీఆర్
మూసీని ఉద్ధరిస్తామని చెప్తూనే బుల్డోజర్లతో తొక్కిస్తాం, మూసీలో ముంచేస్తాం అంటూ రేవంత్ చేస్తున్న వ్యాఖ్యల వెనక అసహనం కనిపిస్తున్నది. నిజానికి ఫ్లోరైడ్ సమస్య నుంచి నల్లగొండకు శాశ్వత విముక్తి ప్రసాదించాలని సంకల్పించేందుకు కేసీఆర్. మిషన్ భగీరథ పథకంతో 2020, 2021 నాటికే నల్లగొండను జీరో ఫ్లోరైడ్ జిల్లాగా మార్చిన ఘనత కేసీఆర్ సొంతం. ఈ మాత్రం కూడా తెలియని రేవంత్ ఇప్పుడు నల్లగొండను మార్చేస్తానని, అక్కడి ప్రజల బతుకులు బాగుచేస్తానని భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్ పాప ఫలితమే నల్లగొండ ప్రజలకు శాపమైందన్న విషయాన్ని మర్చి ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఉద్యమ నేతగా ఉన్నప్పుడే నల్లగొండపై ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం అయ్యాక ఫ్లోరైడ్ రక్కసి నుంచి నల్లగొండను రక్షించారు.
బీఆర్ఎస్ చెప్తున్నదేమిటి? రేవంత్ ప్రేలాపనలేంటి?
నిజానికి కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలు ఎవరూ, ఎన్నడూ మూసీ పునరుజ్జీవానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మూసీ పునరుజ్జీవంపై అభ్యంతరం చెప్పలేదు. అయితే, ఈ పునరుజ్జీవం పద్ధతి ప్రకారం జరగాలని, పునరుజ్జీవం పేరుతో పేదలను బలిచేయవద్దని మాత్రమే చెప్తున్నది. మూసీ పరీవాహక ప్రాంతంలోని పేదల ఇండ్లను కూలగొట్టకుండా కూడా మూసీని ప్రక్షాళన చేయవచ్చిని చెప్తున్నది తప్పితే దానికి వ్యతిరేకమని ఏనాడూ పేర్కొన్నలేదు. ఒకవేళ పేదల ఇండ్లు కూల్చాల్సి వస్తే వారికి సరైన న్యాయం చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నది. కానీ, రేవంత్‌రెడ్డి అండ్ కో మాత్రం మూసీ ప్రాజెక్టును కేటీఆర్, హరీశ్, బీఆర్ఎస్ అడ్డుకుంటున్నదని ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ, హైడ్రా విషయంలో బీఆర్ఎస్ పేదల పక్షాన నిలబడడాన్ని జీర్ణించుకోలేకపోతున్న సీఎం రేవంత్ సహనం కోల్పోయి బజారుభాషకు దిగుతుండడాన్ని ప్రజలు గమనిస్తున్నారు.
వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం
మూసీ ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోతున్నది హైదరాబాద్‌లోని మూసీ పరీవాహక పేదలు. రేవంత్‌రెడ్డి మాత్రం నల్లగొండలో మాట్లాడుతూ మూసీని అభివృద్ధి చేస్తానంటే బీఆర్ఎస్ అడ్డుకుంటున్నదని ఆరోపిస్తున్నారు. మూసీ పరీవాహక ప్రజలకు అండగా నిలుస్తూ మూసీ ప్రక్షాళనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం ద్వారా.. మీ బాగు కోసం తపిస్తుంటే హైదరాబాద్ ప్రజలు అడ్డుకుంటున్నారని పరోక్షంగా చెప్పడం ద్వారా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు రేకెత్తించే ప్రయత్నాలు ప్రారంభించారు.
నేనెందులో తక్కువ?
మూసీ ప్రాజెక్టుకు అడ్డొస్తే ప్రతిపక్ష నేతలను బుల్డోజర్లతో తొక్కిస్తానని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే చెప్పడంతో నల్లగొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరింత చెలరేగిపోయారు. మూసీ ప్రక్షాళన చేస్తామంటే డోజర్లకు అడ్డం పడుతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, అలా వస్తే వారి మీది నుంచి డోజర్లను పోనిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డోజర్ కింద పడుకునే యాక్షన్ చేస్తే డోజర్లను వారి మీది నుంచి పోనిస్తాం తప్ప పనులైతే ఆపేది లేదని తేల్చి చెప్పారు. పదేండ్లు అధికారంలో ఉండి మూసీని సాఫ్ చేయని మీదీ ఒక బతుకేనా? అని ప్రశ్నించారు. కింద ఫ్లోరైడ్ నీళ్లు.. పైన మురికి మూసీ నీళ్లతో ఎప్పుడు చస్తామో తెలువని బతుకులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ ఆశాకిరణంలాగా కనిపించారంటూ సీఎం మెప్పు పొందే ప్రయత్నం చేశారు. రేవంత్‌రెడ్డి ఐదేండ్లు సీఎంగా ఉంటారని, ఆ తర్వాత మళ్లీ సీఎం అవుతారని, అప్పటికి మూసీ పూర్తవుతుందని చెప్పడం గమనార్హం.
ఫ్లోరైడ్ రహిత జిల్లాగా నల్లగొండ
నల్లగొండ జిల్లాను కేంద్రం పలుమార్లు ఫ్లోరైడ్ రహిత జిల్లాగా ప్రకటించింది. 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ (స్వచ్ఛమైన తాగునీటి సరఫరాతో) జిల్లాలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్రం ప్రకటించింది. 2014లో 413 మందికి 1.5 పీపీఎం కంటే ఎకువ ఫ్లోరిన్ శాతంఉంది. ఆ తర్వాత ఈ సంఖ్య ప్రతి ఏడాదీ తగ్గుతూ వచ్చింది. 2020 నాటికి పూర్తి ఫ్లోరైడ్ రహిత జిల్లాగా అవతరించింది.