Revanth Reddy | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): బహిరంగ మార్కెట్ నుంచి మరో రూ.3 వేల కోట్ల రుణ సమీరణ కోసం రేవంత్రెడ్డి సర్కారు శుక్రవారం రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి ఇండెంట్ పెట్టింది. ఈ నెల 11న ఆర్బీఐ నిర్వహించే బాండ్ల వేలంలో పాల్గొని 24 ఏండ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్లు, 27 ఏండ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్లు, 28 ఏండ్ల కాలపరిమితితో మరో రూ.1,000 కోట్ల చొప్పన అప్పు తీసుకోనున్నది.
ఈ నెల 4న జరిగిన బాండ్ల వేలంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం రూ.2 వేల కోట్ల రుణం పొందిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పు రూ.66,827 కోట్ల్లకు చేరింది.
హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) నుంచి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏయూడీ) రూ.1,000 కోట్ల రుణం తీసుకున్నది. మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం హడ్కోకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం ద్వారా ఈ అప్పు తెచ్చింది. దీంతో ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా కార్పొరేషన్లు/ఎస్పీవీల నుంచి రేవంత్రెడ్డి సర్కారు తెచ్చిన మొత్తం అప్పు రూ.62,991 కోట్లకు చేరింది.