జూబ్లీహిల్స్, ఆగస్టు 6: ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీల అమలులో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి గద్దె దిగాలని పలువురు మహిళలు మండిపడ్డారు. మంగళవారం ప్రజాభవన్‌కు వచ్చిన ముస్లిం మైనార్టీ మహిళలు ప్రజాపాలనలో 8 నెలల క్రితం ఇచ్చిన తమ దరఖాస్తులు ఏమయ్యాయని నిలదీశారు. బాలానగర్ చింతల్‌కు చెందిన షను, కుత్బుల్లాపూర్‌కు చెందిన తాహెరా బేగం మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ ఇప్పటికీ అందలేదని, రూ.500కు సిలిండర్ ఉత్త గ్యాసేనని ఎద్దేవా చేశారు. బస్సు ఫ్రీ ఇస్తే మహిళలకు సీటులేదని వాపోయారు. మహిళలకు రూ.2500పథకం బూటకమని దుయ్యబట్టారు. 100 రోజులలో చేస్తామన్న పథకాలు 8నెలలైనా అమలు జరుగలేదని, రేవంత్ పాలన బేకార్ అని వ్యాఖ్యానించారు. మళ్లీ కేసీఆర్, కేటీఆర్‌ను దించుతామని.. రేవంత పాలనలో భద్రత కూడా కరువయ్యిందని ఏకరువు పెట్టారు..
ఉపాధి హామీ పథకం అటెండర్ల ఆవేదన
ప్రజాభవన్, ఆగస్టు 6 : ప్రజాపాలన తెస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి 8 నెలలుగా ఉపాధి హామీ సిబ్బంది వేతనాల ఊసే ఎత్తడంలేదని.. ప్రజావాణి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడంలేదని సంబంధిత ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం టీఎంఏ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దేవేందర్, షేక్ బీపాషా ఆధ్వర్యంలో ప్రజాభవన్‌కు చేరుకున్న సిబ్బంది ప్రభుత్వం ఇచ్చే రూ.5200 జీతంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాల్లో నియమితులైన 540 మంది ఎంసీసీ అటెండర్ల జీతభత్యాలు ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణాలే సరిపోయాయన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.