హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం అని, ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టారు. మా పథకాలు అమలైతేనే ఓటు వేయండని రేవంత్‌రెడ్డి చెప్పారు. రైతుబంధు, రైతుభరోసా, బోనస్ అందినవాళ్లే మాకు ఓటు వేయండని పదే పదే ప్రసంగాలు చేశారు. కాబట్టే గ్రాడ్యుయేట్ ఓటర్లు నికచ్చిగా తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించారు. ఇకనైనా రేవంత్ తన అసమర్థతను ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి సీఎం పదవికి రాజీనామా చేయాలి’ అని ఒక ప్రకటనలో సతీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.